బాలికలదే పైచేయి | again best result of girls in intermediate examination in district | Sakshi
Sakshi News home page

బాలికలదే పైచేయి

Published Sun, May 4 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

again best result of girls in intermediate examination in district

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించారు. వివిధ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో మెరిశారు. గత ఏడాదికంటే ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒక శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో) పి.మాణిక్యం శనివారం విడుదల చేశారు.

  జిల్లా విద్యార్థులు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే 1.5 శాతం అదనపు ఉత్తీర్ణత సాధించారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో నిలిచారు. ఉత్తీర్ణతలో బాలురు కంటే బాలికలదే పైచేయి. జిల్లా సగటు కంటే బాలికలు 5 శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. బాలురు జిల్లా సగటు ఉత్తీర్ణత కంటే మూడు శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ ఇంగ్లిష్ మీడియంలో చీరాల విజ్ఞాన భారతి కళాశాల విద్యార్థిని బొలిశెట్టి సాయిప్రసన్న 988/1000 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అద్దంకి గోవిందాంబికా పరమేశ్వరి జూనియర్ కాలేజీ విద్యార్థిని తాడి దివ్యవాణి, చీరాల శ్రీగౌతమి జూనియర్ కాలేజీకి చెందిన యడవల్లి రాఘవేంద్ర 987/1000 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు.

బైపీసీ ఇంగ్లిష్ మీడియంలో ఒంగోలు శ్రీచైతన్య కాలేజీకి చెందిన కత్తినేని లక్ష్మీకావేరి 975/1000 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే కాలేజీకి చెందిన కే శిరీష 973/1000 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ఎంఈసీలో మార్కాపురం శ్రీ సాధన జూనియర్ కాలేజీకి చెందిన బి. సాయికుమార్ 970 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఒంగోలు శ్రీగురు అకాడమీ విద్యార్థులు ఎమ్.మహేష్ 969/1000 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానం, జి.బాలాజీ 960/1000 మార్కులతో తృతీయ స్థానం, పీ లక్ష్మీనారాయణ 959/1000 మార్కులతో నాల్గవ స్థానంలో నిలిచారు.

 67 శాతం ఉత్తీర్ణత
 జిల్లాలో పరీక్షలకు మొత్తం 21,385 మంది హాజరు కాగా 14,390 మంది ఉత్తీర్ణులయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలురు 11,655 మంది పరీక్షకు హాజరు కాగా 7,423 మంది పాసై 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా బాలికలు 9,730 మంది పరీక్షలకు హాజరు కాగా 6,967 మంది పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆర్‌ఐవో మాణిక్యం తెలిపారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. గతేడాది కూడా జిల్లా ఇంటర్ ఫలితాల్లో 7వ స్థానంలోనే నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాలతో పోల్చుకుంటే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11 శాతం మంది అదనంగా ఉత్తీర్ణులయ్యారు.

 సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు: ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా సగటు కంటే 2.67 శాతం అదనపు ఉత్తీర్ణత సాధించి శభాష్ అనిపించారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో కూడా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల సాధనలో ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు 94.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 109 మంది పరీక్షకు హాజరు కాగా 103 మంది పాసయ్యారు.

 దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు 90.32 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. 62 మంది పరీక్షకు హాజరు కాగా 56 మంది పాసయ్యారు. యర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 86.98 శాతం ఉత్తీర్ణత సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. 215 మంది పరీక్షకు హాజరు కాగా 187 మంది పాసయ్యారు. మద్దిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తీర్ణతలో అట్టడుగున నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు కేవలం 38.10 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 63 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం 24 మంది మాత్రమే పాసయ్యారు.

 చతికిలపడిన ఎయిడెడ్ కళాశాలలు: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఎయిడెడ్ కళాశాలలు అట్టడుగున నిలిచాయి. జిల్లా సగటు కంటే 21 శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కళాశాలల్లో జిల్లా సగటు కంటే నూతలపాడు డీఎస్‌వీకేఆర్‌ఎం జూనియర్ కళాశాల అదనపు ఉత్తీర్ణత సాధించింది. ఈ కళాశాల విద్యార్థులు 80 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 15 మందికి గాను 12 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఒంగోలులోని హెచ్‌సీఎం జూనియర్ కళాశాల 63.64 శాతంతో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 77 మంది పరీక్షకు హాజరు కాగా 49 మంది ఉత్తీర్ణులయ్యారు. పర్చూరు బీఏఆర్ అండ్ టీఏ జూనియర్ కళాశాల, చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు 57.14 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానంలో నిలిచారు. ఫలితాల సాధనలో ఒంగోలు ఏబీఎం జూనియర్ కళాశాల అట్టడుగున నిలిచింది. ఈ కళాశాల నుంచి 15 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం నలుగురు మాత్రమే పాసయ్యారు.

 సాంఘిక సంక్షేమ, గురుకుల జూనియర్ కళాశాలల్లో..
 జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల విద్యార్థులు జిల్లా సగటు కంటే 26.69 శాతం అదనపు ఉత్తీర్ణత సాధించారు. పెదపవని జూనియర్ కళాశాల 98.63 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కళాశాల నుంచి 73 మంది పరీక్షలు రాయగా 72 మంది ఉత్తీర్ణులయ్యారు. సింగరాయకొండ జూనియర్ కళాశాలలో 54 మందికి గాను 51 మంది ఉత్తీర్ణులై 94. 44 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచారు. అర్ధవీడు జూనియర్ కళాశాలలో 51 మందికిగాను 48 మంది పాసయ్యారు. చీమకుర్తి జూనియర్ కళాశాల 90 శాతం ఉత్తీర్ణతతో చిట్టచివరన నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement