ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి | Should respect public opinion | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి

Published Wed, Sep 21 2016 12:18 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి - Sakshi

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి

  • పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఫ్రొఫెసర్‌ కోదండరాం
  • జనగామ : కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. జనగామ జిల్లా సాధన కోసం పట్టణంలో మంగళవారం నిర్వహించిన జనగర్ఝన సభలో ఆయన మాట్లాడారు. నిపుణులతో కమిటీలు వేసి, అందరి సూచనలు, అభిప్రాయాలు తీసుకుని ప్రజల ముందు చర్చ పెడితే ఈ గందరగోళ పరిస్థితి ఉండేది కాదన్నారు. యాదాద్రికి తామెప్పుడూ వ్యతిరేకం కాదని, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని, అయితే చరిత్ర కలిగిన జనగామను కూడా జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ‘వద్దన్న హన్మకొండ వరంగల్‌ రూరల్‌ జిల్లాగా ఏర్పడుతుంది..కావాలన్న జనగామ ఎందుకు ఇవ్వడం లేదో  అంతుచిక్కడం లేద’న్నారు. జిల్లాల ఏర్పాటు కోసం ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరుతూనే, హక్కు లేకుండా చేసే విచిత్ర పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి సాయుధ పోరాట చరిత్ర, జనగామ ప్రత్యేకతను గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల భావ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పాలన చేయాలే తప్ప.. ఉక్కుపాదంతో అణిచివేసే ధోరణి ఉండకూడదన్నారు. జనగర్జన సభ నిర్వహించుకుంటామని పోలీసులను అడిగితే అనుమతి నిరాకరించారు, హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాము కదా, మీరే అంగీకరిస్తే రెండు గంటలు మాట్లాడుకునే వెళ్లేవారమని అన్నారు. జనగామ జిల్లా అయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.  
     
    సీఎంకు దండపెట్టి వేడుకుంటున్నా: ముత్తిరెడ్డి
    ‘జనగామ జిల్లా న్యాయమైన కోరిక..బ్రిటిష్‌ కాలంలోనే ఈ ప్రాంతాన్ని జిల్లా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు..వందేళ్ల క్రితమే జిల్లా కాకుండా ఆన్యాయం చేశారు’ అని స్థానిక, అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా ప్రతిపాదనను నాడే సీఎంకు దండం పెట్టి ఇచ్చానన్నారు. మంత్రిమండలి సమావేశంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలిచి మద్దుతుగా తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారని గుర్తు చేశారు. గద్వాల జిల్లాను చేసే ప్రసక్తే లేదని తేల్చేసిన కేసీఆర్‌.. జనగామ విషయమై మాట్లాడకపోవడం అనుకూల సంకేతాలు ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయన్నారు. జనగామ ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని,  జిల్లాను అడ్డుకోవద్దని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు.  
     
    గర్జించిన జనగామ
     
     జిల్లా సాధన కోసం జనగామ గర్జించింది. పట్టణంలోని ప్రెస్టన్‌ మైదానంలో జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరై ప్రసంగించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు సభ నిర్వహణకు హైకోర్టు అనుమతించడంతో చాలా మంది ముఖ్యులు మాట్లాడలేక పోయారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తమ ఆస్థిత్వం కోసం సాగిన తెలంగాణ ఉద్యమం మాదిరిగానే జనగామ జిల్లా కోసం ప్రజలు పోరాడుతున్నారని అన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు సలహా ఇస్తున్నానని, దీన్ని ఇగోగా తీసుకోవద్దని అన్నారు. పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణలో జనగామకు ఎందుకు అన్యాయం చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
     
    అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి సభకు వచ్చి మాట్లాడటం కాదు..సీఎంను ఒప్పించి జిల్లా తీసుకు రావాలని కోరారు. సీపీఎం శాసనసభ పక్ష నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ..  రాబోయే శాసన సభా సమావేశాల్లో జనగామ జిల్లాపై మొదటి ఎజెండాగా మాట్లాడతామని అన్నారు. ఏజెన్సీలోని భద్రాచలంతోపాటు జనగామ జిల్లా చేయాలని తమ పార్టీ నుంచి బలమైన నినాదం వినిపించామన్నారు. జిల్లాల నోటిఫికేషన్‌లో గందరగోళం ఏర్పడడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. జనగామ ఆందోళనలను గౌరవించాలని కేసీఆర్‌ను కోరారు.
     
    రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ మాట్లాడుతూ మడమ తిప్పను..మాట తప్పను..తప్పితే తల నరుక్కుంటా.. అన్న కేసీఆర్‌ మాటలు ఉత్తివేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా ఉద్యమాన్ని ఉక్కుపాదాలతో అణిచివేస్తూ సభకు అనుమతి నిరాకరించి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. కేసీఆర్‌ నయా నిజాంగా అవతారమెత్తాడని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఇవ్వకుంటే అధికార పార్టీ నేతలను తిరుగనివ్వబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాట తప్పుతున్న కేసీఆర్‌ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. ప్రజల నిర్ణయాన్ని పాలకులు పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐ రాష్ట్ర నేత అజీజ్‌పాషా మాట్లాడుతూ తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటులో పొలిటికల్‌ వ్యాపారమేంటని ప్రశ్నించారు. జనగామ చరిత్ర, ఇక్కడి వనరులను దృష్టిలో ఉంచుకొని జిల్లాచేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు.
     
    టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాల మంటలో సీఎం కేసీఆర్‌ పతనం తప్పదని   అన్నారు. తెలంగాణలో మరో నైజాంలా అవతరించి నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. జిల్లాలను ఇష్టారాజ్యంగా చేసుకుంటూ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ జనగామ జిల్లా ఏర్పాటుకు బీజెపీ సంపూర్ణ మద్ధతు అందిస్తుందని అన్నారు. హన్మకొండ వద్దంటే వరంగల్‌ రూరల్‌ జిల్లా అంటూ పూటకో మాట మాట్లాడుతున్న ప్రభుత్వం ధ్వంద్వ నీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామన్నారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఆన్యాయం జరుగకుండా చూస్తామన్నారు.
     
    టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటులో కేసీఆర్‌ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఆమోదించుకొని వస్తే ఆయనతో కలసి జనగామలో నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నారు. అధికారంలోకి రాగానే 11వ జిల్లా జనగామ అని ఎన్నికల సభలో చెప్పిన సీఎం కేసీఆర్‌ మాట మరిచిపోయారన్నారు.  
     
    మా పోరాటం న్యాయమైందే..
    -జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంత్‌రెడ్డి
    తమ ఆస్థిత్వాన్ని కాపాడుకునేందుకు జనగామ జిల్లా కోసం ఉద్యమం చేస్తున్నామని జేఏసీ చైర్మన్‌ ఆరుట్ల దశమంత్‌రెడ్డి అన్నారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైందని భావించి ప్రభుత్వం జనగామ జిల్లా చేస్తున్నట్లు ప్రకటించి ప్రజల ఆకాంక్షను విలువనివ్వాలని కోరారు. జన గర్జన సభకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తే హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని నిర్భంద కాండ స్వరాష్ట్రంలో తమపై మోపుతూ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement