ట్రంప్‌ను మించిపోయిన కేసీఆర్
రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు
రాజకీయ పునరేకీకరణకు కోదండరామ్ ముందుకురావాలి
తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్
రామగిరి (నల్లగొండ) : ముఖ్యమంత్రి చర్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మించిపోయాయని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. నల్లగొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగం ఆయన హక్కుల పత్రం కాదని పేర్కొ న్నారు. ఆయనను విమర్శించిన వారిని జంతువులకంటే హీనంగా చూస్తున్నారని, కేసీఆర్ పాశవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించే రాజకీయ వ్యవస్థ తీవ్ర స్థాయిలో అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ హైద్రాబాద్‌లో ర్యాలీ నిర్వహించతలపెట్టిన జేఏసీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందన్న సాకు.. ర్యాలీలో ఉగ్రవాదులు పాల్గొంటారనే నెపంతో ర్యాలీని భగ్నం చేయడం సహించలేనిదన్నారు. శంషాబాద్, శామీర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ, నాగోల్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని పోవాలని సూచించారు. జేఏసీ ద్వారా కాకుండా రాజకీయ పార్టీగా ఆవిర్భవించి కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కె.పర్వతాలు, నార్కెట్‌పల్లి రమేష్, సందెపాక రాము, మోహనకృష్ణ, కొండేటి మురళి, సైదులు, విక్రం తదితరులు పాల్గొన్నారు.