
తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇంత బలహీనమా?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ కోదండరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సంబోధిస్తూ టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏఐసీసీ చీఫ్ తో భేటీపై విమర్శలను తోసిపుచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రభుత్వం తనపై దాడిచేస్తున్నదని ఆరోపించారు.
జేఏసీ చైర్మన్ కోదండరామ్ బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ..‘కొందరు టీఆర్ఎస్ నాయకులు నేను సోనియా గాంధీని కలిసి వచ్చానని అంటున్నారు. వాళ్లు చెప్పిన తేదీల్లో, అంటే, జూన్ 16న నేను వారణాసికి వెళ్లానేతప్ప ఢిల్లీకి కాదు, జూన్ 27న ఇందిరాపార్క్ ధర్నాలో పాల్గొన్నా. నేను ఎప్పుడు ఎక్కడ ఎం చేస్తున్నానో, ఎవరెవరిని కలుస్తున్నానో తెలుసుకోలేనంత బలహీనంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉందా?’ అని అన్నారు.
ప్రజాసమస్యలపై సమాధానం చెప్పలేకే అధికార పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని కోదండరామ్ మండిపడ్డారు. జేఏసీ విమర్శలు నూటికి నూరుశాతం సామాజిక వాస్తవాలేనని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ప్రతిచోటా దౌర్జన్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన తెలంగాణలో ప్రజలు ఆశించింది ఇలాంటి విధానాలు కావన్నారు. నవంబర్ 11న మంథనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. 13న హైదరాబాద్‌లో వైద్యరంగ సమస్యలపై సదస్సు, 20న హైదరాబాద్‌లో సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్‌ల సమస్యలపై సదస్సు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కోదండరామ్ పేర్కొన్నారు.