
కోదండరాంను విమర్శించడం తగదు
► మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం
► సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ఎదులాపురం : ప్రజల పక్షాన పోరాడుతున్న జేఏసీ చైర్మన్ కోదండరాంను టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు, నేతలు విమర్శించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం రైతులను నష్టాల పాలు చేస్తోందని, మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన పోరాడుతామని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు వాత పెడితే తిరిగి ప్రజలు వాతలు పెట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. అటవీ హక్కు చట్టాన్ని అనుసరించి పట్టాలు పంపిణీ చేసే వరకు గిరిజనుల పక్షాన పోరాడుతామని తెలిపారు. పార్టీలు మారే ముందు నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసే విధంగా ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, సహ కార్యదర్శి ఎస్.విలాస్, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నళినిరెడ్డి, అరుణ్‌కుమార్, సిర్ర దేవేందర్, మేస్రం భాస్కర్, కుంటాల రాములు పాల్గొన్నారు.