ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఈజిప్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
దారుషిఫా, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఈజిప్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఇది అతి హేయమైన చర్యని, అక్కడి ఉద్యమకారులపై మిలటరీ అతి కిరాతకంగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈజిప్టులో జరుగుతున్న మారణకాండ, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా జామాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ శాఖ బుధవారం కింగ్‌కోఠి ఈడెన్ గార్డెన్‌లో నిరసన సభను నిర్వహించింది.
ఇందులో కోదండరాం మాట్లాడుతూ... అంతార్జాతీయ రాజనీతి సూత్రాలు, మానవహక్కులను కాలరాసి ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. వీటన్నిం టికీ అగ్రరాజ్యమైన అమెరికానే కారణమన్నారు. భారత ప్రభుత్వం రాజ్యంగంలోని ఆర్టికల్-4 ద్వారా ప్రపంచ శాంతికోసం అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అదేవిధంగా ఈజిప్టుతో విదేశాంగ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలన్నారు.
ఈ మారణకాండను ఆపాలని కోరుతూ వెంటనే అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కార్యక్రమానికి హాజరైన ఇతర వక్తలు చెప్పారు. జామాతే ఇస్లామీ రాష్ర్ట అధ్యక్షులు ఖాజా ఆరీఫుద్దీన్, జమియతే ఆహేలే హదీస్ రాష్ర్ట అధ్యక్షులు మౌలానా షఫీ మదనీ, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్, ఎమ్మెల్సీలు మహమూద్‌అలీ, మహ్మద్ సలీం, టీఆర్‌సీ చైర్మన్ వేదకుమార్, సియాసత్ మేనేజింగ్ డెరైక్టర్ జహీరుద్దీన్ అలీఖాన్ పాల్గొన్నారు.