
ఫార్మాకు వేల ఎకరాలెందుకు?
ప్రభుత్వానికి జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్న
కడ్తాల్: ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలకొద్దీ ఎకరాల భూములు అవసరమా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిర్వహించిన ‘ఫార్మాసిటీ భూ నిర్వాసితుల గోస’ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగడం లేదని ఆయన విమర్శించారు. జీవో కంటే పార్లమెంటు చేసిన చట్టం ఉన్నతమైనదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని సూచించారు. మార్కెట్ ధరకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని, చట్టాన్ని అతిక్రమించి ఇష్టాను సారంగా భూ సేకరణ చేపట్టడం సరికాదన్నారు. రైతులు ఆలోచించి నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని, వారికి అన్ని సమయాల్లో వెన్నంటి ఉంటామని కోదండరాం భరోసా ఇచ్చారు. భూములు కోల్పోతున్న రైతులకే కాకుండా వాటిపై ఆధారపడిన వారికీ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.