టీడీపీ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి
వరంగల్ : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్ మంత్రులకు నేతలకు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని బాలసముద్రంలో మంగళవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదండరాం రాజకీయ వ్యక్తి కాదని, ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి దోహదపడ్డారని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జేఏసీ భాగస్వామ్యం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏంచేశారని గులాబీ కండువాలు కప్పుకున్న కడియం, పోచారం, తలసాని ఆయన్ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.
మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె సమయంలో కేసీఆర్, హరీష్‌రావు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ తర్వాత అంతే నిబద్ధత గల వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అని, ఆయనపై ఆరోపణలు చేయడాన్ని టీడీపీ ఖండిస్తోందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, జిల్లా కార్యదర్శి బైరపాక ప్రభాకర్, బాస్కుల ఈశ్వర్, చాడ రఘునాథరెడ్డి, శ్రీరాముల సురేష్, సదానందం, మార్గం సారంగం, రవిగుప్తా పాల్గొన్నారు.