
కోదండ దీక్షాస్త్రం
► సర్కారు నిర్బంధంపై టీజేఏసీ చైర్మన్ మండిపాటు
► నిర్వాసితుల హక్కులను హరించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
► 2013 భూసేకరణ చట్టం ప్రకారమే వారికి పునరావాసం కల్పించాలి
► మాది బలప్రదర్శన కాదు.. నిర్వాసితుల గోడు వినిపించేందుకే ధర్నా
► అసెంబ్లీలో అన్యాయంగా ఆమోదించుకున్న బిల్లు నిలవదు
► పోరు ఆగదు.. నిర్వాసితులకు అండగా నిలుస్తామని వెల్లడి
► తన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష
► కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ న్యూడెమొక్రసీల మద్దతు
► ఈ నియంతృత్వం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా?: ఉత్తమ్
► గొంతెత్తేవారిని అణచేయాలని ప్రభుత్వం చూస్తోంది: జానారెడ్డి
► నిరసనలను అడ్డుకోవడం మంచిది కాదు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : చట్టం ప్రకారం భూనిర్వాసితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తలపెట్టిన దీక్షకు అనుమతిని నిరాకరించి, జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసినందుకు నిరసనగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం దీక్షకు దిగారు. గురువారం ఉదయమే కోదండరాం నివాసంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశ మైంది. భేటీ అనంతరం తన నివాసంలోనే దీక్షకు దిగుతున్నట్టుగా కోదండరాం ప్రకటించారు. నిర్వాసితుల హక్కులను హరించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, భూసేకరణ చట్టం–2013 ప్రకారం వారికి పునరావాసం కల్పించాలని, అక్రమంగా అరెస్టు చేసిన జేఏసీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నట్టుగా తెలిపారు.
దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమొక్రసీ, వివిధ ప్రజాసంఘాలు కోదండరాం దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించాయి. ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం నివాసంలోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష జరిగింది. వివిధ పార్టీలు, జేఏసీ స్టీరింగ్ కమిటీ సూచన మేరకు దీక్షను విరమిస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చేతుల మీదుగా పండ్లరసాన్ని స్వీకరించి సాయంత్రం ఆయన దీక్షను విరమించారు.
బల ప్రదర్శనకు కాదు.. బాధ చెప్పుకోవడానికే..
ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ వేదికపైకి పోలేదని, భూనిర్వాసితుల కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కోదండరాం తెలిపారు. ‘‘భూసేకరణపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, భూసేకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వానికి నివేదించినం. ప్రభుత్వం వినకుంటే ధర్నాకు పిలుపునిచ్చినం. జేఏసీ బలం చూపించాలని కాదు.. భూనిర్వాసితుల గోడును, గొంతును హైదరాబాద్‌కు వినిపించడానికే. ధర్నాకు అనుమతిని ఇవ్వకున్నా జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీక్షకు అనుమతి ఇవ్వనప్పుడు, తిరస్కరించనప్పుడు జేఏసీ నేతలను ఎందుకు అరెస్టు చేశారు? నేను దీక్షకు దిగిన తర్వాతనే జేఏసీ నేతలను విడిచిపెట్టారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్న తీరు బాధాకరం. శాసనసభలో అందరికీ న్యాయం జరగాలి. అన్యాయంగా ఆమోదించుకున్న బిల్లు నిలువదు. భూసేకరణకు మేం వ్యతిరేకం కాదు. మల్లన్నసాగర్‌లో పదిరోజులు నిరసనలు జరిగినా వెళ్లలేదు. పది రోజుల తర్వాత ఇంజనీర్లు, న్యాయవాదులతో కలిసి వెళ్లిన తర్వాతనే పోరాటానికి దిగినం. మల్లన్నసాగర్ డీపీఆర్ ఎక్కడ, దానికి ఎంత భూసేకరణ అవసరం, భూమిని కోల్పోయినవారికి ఏమి ఇస్తారు అని అడిగితే నేరమా? భూసేకరణ చట్టం అమలు చేయకుండా భూమిని గుంజుకోవడానికే వ్యతిరేకం. ప్రాజెక్టులకు, అభివృద్ధికి మేం అడ్డం కాదు. మా ఐక్యతను తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. అన్ని సమస్యలపై ఐక్య కార్యాచరణ ఉంటుంది’’అని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం నిర్బంధానికి దిగుతున్నదంటే.. తనకు తానే నిర్బంధం చేసుకుంటున్నట్టని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల, నిరసనల గొంతు నొక్కడం సాధ్యం కాదని వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు. ‘‘దీక్షను విరమిస్తున్నా నిర్వాసితుల పక్షాన పోరాటం ఆగదు, వారికి జేఏసీ అండగా ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలు, ఆదేశాలతో మేం పనిచేయం. స్టీరింగ్ కమిటీ నిర్ణయంతోనే దీక్షకు దిగిన, విరమించుకుంటున్నా’’అని వెల్లడించారు.
ఇందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ప్రజాస్వామిక ధర్నాలకు, నిరసనలకు అనుమతిని ఇవ్వకుండా అరెస్టులు చేయడం దారుణం. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన తెలంగాణవాదులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? ప్రభుత్వ నిర్భంధాన్ని సహించేది లేదు. భూసేకరణ చట్టంపై లోతుగా చర్చ, అధ్యయనం జరగాలి. సీఎం కేసీఆర్ అబద్ధాలకోరు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటాలకు అండగా ఉంటాం. ప్రజల కోసం కోదండరాం ఉద్యమించడం ఆయన హక్కు, బాధ్యత.
కేసీఆర్ చెప్పేదాకా కోదండరాం కులం తెలియదు: జానారెడ్డి, సీఎల్పీ నేత
సీఎం కేసీఆర్ చెప్పేదాకా కోదండరాం సార్ రెడ్డి అని తెలియదు. కేసీఆర్ చెప్తేనే రెడ్డి అని తెలిసింది. ఒక సామాజిక ఉద్యమకారునిగానే కోదండరాం తెలుసు. అలాంటి కోదండరాంకు కులాన్ని ఆపాదించడం సరికాదు. తెలంగాణలో పాటలు పాడుతున్నవారిని, మాట్లాడుతున్నవారిని అణిచేయాలని ప్రభుత్వ చూస్తున్నది. కాంగ్రెస్ ఆగలేదు, తగ్గలేదు. ప్రజల్లో, మీలో చైతన్యం కోసం చూస్తున్నాం. భూనిర్వాసితులకోసం కోదండరాం చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి. వెంటనే కోదండరాంతో ప్రభుత్వం చర్చించాలి.
బంగారంలాంటి ముఖాన్ని చూడటానికి భయం: రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత
కోదండరాం సార్ ముఖం బంగారంలా ఉంటదని ఉద్యమకాలంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వంగివంగి దండాలు పెట్టిండు. ఇప్పుడేమో కోదండరాం సార్ ముఖాన్ని చూడాలంటే ఎందుకు భయపడుతున్నడు? తప్పు చేసిన వాళ్లే కేసీఆర్‌లా భయపడ్తరు. తెలంగాణను బొందలగడ్డగా మారుస్తున్న కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదు.
ప్రభుత్వానికి భయం: కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత
భూసేకరణ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రభుత్వం ఎందుకో భయపడుతున్నది. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలను అడ్డుకోవడం మంచిదికాదు.
పేదల కోసం ఎందాకైనా..: చాడ వెంకటరెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి, కె.గోవర్ధన్
భూనిర్వాసితులకు న్యాయం చేయాలని, చట్టం ప్రకారం వ్యవహరించాలని అడగడమే నేరమా? ప్రజలకోసం ఉద్యమాలే తప్పన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. నిరసన చెప్పేది ప్రజలే. ప్రజాస్వామిక నిరసనలపై, ఉద్యమాలపై సీఎం కేసీఆర్ తీరు సరికాదు. కోదండరాం పోరాటాలకు, పేదల కోసం జరుగుతున్న ఉద్యమాలకు ఎంతదాకా అయినా అండగా ఉంటాం.
ప్రజలను వ్యతిరేకించడమే : చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ
నిరసనలు ప్రజలకు ప్రజాస్వామిక హక్కు, నిరసనలను అడ్డుకోవడమంటే ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఇది కోదండరాం వ్యక్తిగతం కాదు. ఇంకా ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజా చైతన్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యమించాలి.
సంఘీభావం ప్రకటించిన వారెందరో...
కోదండరాం దీక్షకు టీఆర్‌ఎస్, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతీరెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య, అమర్‌నాథ్‌బాబు, ఎం.శ్రీనివాస్ సారంగపాణి మద్దతు తెలిపారు. ప్రజాసంఘాల నేతలు సంధ్య(పీవోడబ్ల్యూ), చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు.
శాంతిభద్రతల కోణంలోనే అనుమతి నిరాకరణ: డీజీపీ
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన దీక్షకు శాంతి భద్రతల కారణంతోనే అనుమతిని నిరాకరించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఇతర సమస్యలు ఉన్నప్పుడు అన్నింటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న కారణంతోనే అనుమతి నిరాకరించామన్నారు.