
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోదండరామ్
మండిపడిన ఎమ్మెల్సీ కర్నె, ఎమ్మెల్యే కూసుకుంట్ల
సాక్షి , హైదరాబాద్: ప్రభుత్వం ఏ పనిచేసినా గుడ్డిగా వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, టీఆర్‌ఎస్ గెలిచిన మరుసటి రోజు నుంచే విమర్శలు మొదలుపెట్టిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా ఇపుడు కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఒక ఎజెండా పెట్టుకుని కోదండరాం పనిచేస్తున్నారని, పేరుకు వేదిక వేరే అయినా, ఫక్తు కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
నార్లపూర్ నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవద్దని ఆయన కొత్త పల్లవి అందుకున్నాడని, ఫ్లోరోసిస్ కేంద్రంగా ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుపోవద్దని కోదండరాం చెప్పటం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రాంతంపై సానుభూతి లేకుండా మాట్లాడుతున్నాడని, ఆయన ప్రజలపక్షం కాదని తేలిపోయిందన్నారు. కోదండరాం గాంధీభవన్‌లో కూర్చుని మాట్లాడితే తమకేమీ అభ్యంతరం లేదని వారు అన్నారు.