హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతుందని, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధులు కర్నె ప్రభాకర్, గట్టు రామచంద్రరావులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాబు ప్రతిదీ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బాబు మనిషో, మరమనిషో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి జరిగితే కేసీఆర్, కేటీఆర్‌లు సాటి మనుషులుగా స్పందించారని అన్నారు. వైఎస్ జగన్‌తో కేసీఆర్ మాట్లాడితే ఎందుకు అంత తత్తరపాటు అని ప్రశ్నించారు.
అలిపిరిలో చంద్రబాబు మీద దాడి జరిగినపుడు తెలంగాణా బద్ధ విరోధి అయినా దాన్ని తాము ఖండించామని పేర్కొన్నారు. దాడిని ఖండిస్తే కేసీఆర్‌కు, మోదీతో సంబంధం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ మానవ సంబంధాలు అనేవి ఉంటాయని చెప్పారు. హరికృష్ణ మరణంపై, హుదూద్ తుపానుపై కూడా మానవీయంగానే స్పందించామని గుర్తు చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే కేసీఆర్ హాజరయ్యారని తెలిపారు. ఆపరేషన్ గరుడ నిజంగా ఉందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కేసుతో అస్థిరత్వానికి గురిచేయాలని చూసింది మాత్రం నిజమని పేర్కొన్నారు.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కోవర్టు అని చెప్పామని ఇప్పుడు అదే నిజమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేపు మహాకూటమి గనుక పొరపాటున అధికారంలోకి వస్తే చంద్రబాబుదే అజమాయిషీ ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌కు మానవ సంబంధాలు కూడా ముఖ్యమని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. చంద్రబాబువి అన్నీ ఆర్ధిక సంబంధాలేనని, ఇకనైనా బాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
తత్తరపాటు ఎందుకు చంద్రబాబూ?: టీఆర్‌ఎస్
Published Fri, Oct 26 2018 3:18 PM | Last Updated on Fri, Oct 26 2018 4:31 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment