
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన ‘విద్యుత్ బిల్లు’పై తమతో వచ్చే రాష్ట్రాలతో కలసి పార్లమెంటులో పోరాడతామని శాసన మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో వ్యవసాయానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి అనుకూలమో, వ్యతిరేకమో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయం (టీఆర్‌ఎస్‌ఎల్పీ) లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రధా ని మోదీ ఫ్యూడల్ విధానాలను వ్యతిరేకించి తీరుతామని, పేదలకు వ్యతిరేకంగా సంస్కరణలు ఉండకూడదన్నదే టీఆర్‌ఎస్ పార్టీ వైఖరి అని పేర్కొన్నారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
ఆకలైన వాడికి ఆరు నెలల తర్వాత బిర్యానీ పెడతామన్న రీతిలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవాలు మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. 70 ఏళ్లుగా కేంద్రంలో మోదీ మినహా ఎవరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆయన వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధు పథకం అమలుకు కేసీఆర్ పెట్టే షరతులను కేంద్రం షరతులతో పోల్చడం కిషన్‌రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రస్తుత సంక్షోభంలో ప్రజల చేతికి డబ్బు అందేలా హెలికాప్టర్ మనీ అంశాన్ని కేసీఆర్ ప్రతిపాదించారని, ఆర్థిక వేత్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నా ప్రధాని మోదీ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యులతో పాటు బీజేపీ నేతలకు కూడా అర్థం కావడం లేదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో కేంద్రం వెచ్చించేది రూ.2.50 లక్షల కోట్లకు మించదన్నారు.