
ఆ కుటుంబానికే అధికారం పరిమితం
జేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపణ
నర్సాపూర్/మెదక్‌జోన్: రాష్ట్రంలో ఆ ఒక్క కుటుంబానికే అధికా రం పరిమితమైందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరుల స్ఫూర్తియాత్ర మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కోదండరాం విలేకరులతో మాట్లా డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్రంలో అధికారం నలుగురి చేతుల్లోనే కేంద్రీకృతమైందని సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మిగిలిన మంత్రులంతా నామమాత్రంగా మిగిలారన్నారు. అధికారం చెలాయిస్తున్నవారు కాంట్రాక్టర్లకు, భూ ఆక్రమణదారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్న ఆకాంక్షలను నెరవేర్చాలన్న సోయి కూడా లేదన్నా రు. తెలంగాణ వనరులు ఇక్కడి ప్రజలకు చెందాలని, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన సాగాలని అందరూ కోరుకుంటుంటే, అలా సాగడం లేదన్నారు.