2కే రన్‌పై ఉక్కుపాదం.. కోదండరాం అరెస్ట్
హైదరాబాద్: ధర్నా చౌక్‌ను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ చేపట్టిన 2కే రన్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచే సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. 6 గంటల నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పరిరక్షణ కమిటీ నేతల అరెస్టు ఉత్కంఠగా కొనసాగింది. సుందరయ్య పార్కు పరిసర ప్రాంతం అంతా నినాదాలతో హోరెత్తింది.
ర్యాలీ ప్రారంభం కాకముందే సుందరయ్య పార్కుకు చేరుకున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు జి.రాములు, నర్సింహ, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య, న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్ధన్, గాయకురాలు విమలక్క తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను తొలగించటం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని తమ్మినేని విమర్శించారు. శాంతియుతంగా ర్యాలీని నిర్వహించడానికి కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.