
బాధిత ప్రజల గుండెచప్పుడు ధర్నాచౌక్
► ఇందిరాపార్కు నుంచి తరలించొద్దు
► అమరవీరులస్మారక స్తూపం వద్ద అఖిలపక్ష నేతల మౌనదీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి ధర్నాచౌక్‌ను తరలించవద్దని తెలంగాణ జేఏసీ, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షనేతలు మౌనదీక్ష చేపట్టారు. అసెంబ్లీ ఎదురుగానున్న అమరవీరుల స్మారకస్తూపం వద్ద శుక్రవారం నిర్వహించిన మౌనదీక్షలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ నేత మల్లేపల్లి ఆదిరెడ్డి, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. మౌనదీక్ష అనంతరం వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు ప్రసంగించారు. ధర్నాచౌక్ బాధిత ప్రజల గుండెచప్పుడు అని అభివర్ణించారు.
రాజ్యాంగ హక్కును హరించొద్దు: కోదండరాం
రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును హరించొద్దు. ఒక్క ధర్నాచౌక్‌ను ఎత్తివేస్తే హైదరాబాద్ నగరమంతా ధర్నాచౌక్‌గా మారుతుంది. ధర్నాచౌక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే 15న చలో ధర్నాచౌక్ నిర్వహిస్తాం. ధర్నాచౌక్‌ను మూసివేస్తే నిరసనలు ఆగవు. ఎవరి మార్గాల్లో వారు ధర్నాచౌక్ దగ్గరకు చేరుకోవాలి. రైతులపట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో రైతులకు బేడీలు వేయడంతో తేలిపోయింది.
ప్రజాస్వామ్యం ఖూనీ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మరింత స్వేచ్ఛ ఉంటుందని భావించినం. ధర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి ఈ చర్యలు నిదర్శనం. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. ధర్నాచౌక్‌ను పరిరక్షించుకుంటాం. ఖమ్మం జిల్లాలో రైతులకు బీడీలు వేసినందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. పంటలను కొనాలని రైతులు ప్రశ్నించడమే నేరమా? రైతులేమన్నా ఉగ్రవాదులా, తీవ్రవాదులా?
ప్రభుత్వ మెడలు వంచుతాం: ఎల్ రమణ
ఇరవై ఏళ్లుగా ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం దుర్మార్గం. సబ్బండ వర్గాల సమస్యలు వినిపించడానికి ధర్నాచౌక్ ఉండాల్సిందే. ఇలాంటి నిరంకుశ, నియంత ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలిస్తాం. ప్రభుత్వ మెడలు వంచి ధర్నా చౌక్‌ను కాపాడుకుంటాం.
హక్కులను హరించొద్దు: ఎన్‌వీవీఎస్ ప్రభాకర్
ప్రజల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. ధర్నాచౌక్ ఎత్తి వేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. దీనిని కాపాడుకోవాలి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రాజకీయ పరిపాలన చేస్తున్నది. ఇది మంచిదికాదు.
నియంతలకు పతనం తప్పదు: తమ్మినేని వీరభద్రం
ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం పతనం కాక తప్పదు. ప్రతిపక్షాలను అణచివేయడం ద్వారా అధికారంలో ఉంటామనుకోవడం భ్రమే. ప్రజలు దీన్ని సహించరు. చలో ఇందిరాపార్కు కార్యక్రమంలో పాల్గొంటాం. ధర్నాచౌక్‌ను కాపాడుకుంటాం.