
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటా పోటీ ధర్నాలతో ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మద్యాహ్నం వరకూ బీజేపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
అయితే బీజేపీ ధర్నాను నిరసిస్తూ తెలుగుదేశం నేతలు సైతం అదే ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టాడికి సిద్ధమయ్యారు. బీజేపీ ధర్నా ముగిసిన అనంతరం ధర్నా చేయడానికి టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో ధర్నాచౌక్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల నేతలు, కార్యకర్తలు అక్కడ చేరడంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీగా బలగాలను మొహరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ బీజేపీకి మధ్యాహ్నం వరకే అనుమతి ఉందని తెలిపారు. వారు వెల్లిన అనంతరం టీడీపీకి అనుమతి ఇచ్చామని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే పోలీసులను మొహరించినట్లు తెలిపారు.