హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్‌లో యధావిధిగా బహిరంగసభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించుకోవచ్చునంటూ హైకోర్టు మంగళవారం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు హర్షించదగినవి. ఇరవైయ్యేళ్లపాటు సామాన్యుడి సమస్యలను ఎలుగెత్తి చాటిన ధర్నా చౌక్ ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలతో మూగబోయింది. నిషేధాజ్ఞలకు ప్రభుత్వం చెప్పిన కారణాలు వింతగా ఉన్నాయని అప్పట్లోనే ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ నిరసన కార్యక్రమాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. ప్రభుత్వ విధానాలపై అసమ్మతి వ్యక్తం చేయడం, వాటికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరాహారదీక్షలు నిర్వహిం చడం, సభలు పెట్టడం మన రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఆ హక్కుకు భంగం వాటిల్ల కుండా చూడటం వల్ల పాలకులకు రెండు ప్రయోజనాలుంటాయి.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చినవారు దానికి బద్ధులై పరిపాలిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలకు కలిగితే అది పాలకులకుండే గౌరవాన్ని పెంచుతుంది. మరోపక్క తాము తీసుకునే నిర్ణయాలపై ప్రజల్లో స్పందన ఎలా ఉందన్న సంగతి పాలకులకు అర్ధమై, సవరించుకోవడానికి వీలవుతుంది. ధర్నా లకూ, నిరసనలకూ అవకాశం లేకుంటే ఇదంతా సాధ్యపడదు. స్థానికుల వినతి మేరకే ధర్నా చౌక్‌ను మార్చవలసి వచ్చిందన్న ప్రభుత్వ సంజాయిషీలో అబద్ధమేమీ లేదు. ఈ విషయంలో అంతకుముందే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ పరిసరాల నుంచి దీన్ని తరలించేలా ఆదేశించమని ఆ పిటిషన్ కోరింది. దానిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే తెలంగాణ సర్కారు ధర్నాచౌక్‌ను సరూర్‌నగర్ స్టేడియానికి తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరసన సమస్యే అను కుంటే, ఆ సమస్య ధర్నాచౌక్ పరిసరాల్లోని వారికి మాత్రమే కాదు... రేపన్నరోజున సరూర్ నగర్ ప్రాంతవాసులకు కూడా ఏర్పడొచ్చు. అప్పుడు మళ్లీ దాన్ని ఇంకోచోటకు తరలిస్తారా? ఇలా అస మ్మతిని, నిరసన గళాలను శివార్లకు నెట్టుకుంటూ పోవడం ప్రజాస్వామిక పరిష్కారమవుతుందా? దీన్ని హైకోర్టు ధర్మాసనంతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పాలకులే నిశితంగా ఆలోచించి ఉంటే వారికే బోధపడేది.
నిరసనలు వ్యక్తం చేయడం, బంద్‌లు, ధర్నాలు నిర్వహించడం మహాపాపమన్న అభిప్రాయం పాలకుల్లో మాత్రమే కాదు... మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజానీకంలో కూడా ఇటీవలి కాలంలో కనబడుతోంది. వారి దృష్టిలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా అభిప్రాయం చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా నిరసనలు రోడ్డెక్కడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోందని వారి ఫిర్యాదు. నిరుడు అక్టోబర్‌లో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) మరో అడుగు ముందుకేసి విచిత్రమైన ఉత్తర్వులిచ్చి అంద రినీ దిగ్భ్రాంతిపరిచింది. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సాగే నిరసనలవల్ల ఆ ప్రాంతం కాలు ష్యమయమైందని, నిరసనల్లో పాల్గొనేవారి కార్యకలాపాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నా యని అది మండిపడింది. ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిందే తడవుగా ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులం దరినీ వెళ్లగొట్టారు. మళ్లీ మొన్న జూలైలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్నంతటినీ చక్కదిద్దాల్సి వచ్చింది. ఎన్‌జీటీ వంటి ఉన్నతస్థాయి సంస్థే నిరసనల్లో పర్యావరణానికి ముప్పు కలిగించే ప్రమా దాన్ని పసిగట్టినప్పుడు, కొన్ని గంటలపాటు నడిరోడ్డుపై చిక్కుకుపోయే సామాన్యులకు చికాకు కల గడంలో, వారు కోర్టుకెక్కడంలో వింతేముంది?
నిరసనలకు ఎటు నుంచి ముప్పు కలుగుతుందో చెప్పడం కష్టం. ఎన్నాళ్లుంటుందో తెలియని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆమధ్య కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యా పకులకు జైల్ మాన్యువల్‌ను తలపించేలా ఒక హుకుం జారీ చేసింది. విద్యావేత్తలెవరూ ప్రభు త్వాలను విమర్శిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయరాదని దాని సారాంశం. 1964నాటి కేంద్ర పౌర సర్వీసుల నియమావళి(సీసీఎస్) అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని యూజీసీ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాలు రూపొందించే విధానాల్లో భాగస్తులవుతారు గనుక ఆ విధానాలను విమర్శిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని నిబంధనావళి చెబుతోంది. దాన్ని కొంతవరకూ అర్ధం చేసుకోవచ్చు. కానీ విశ్వవిద్యాలయ అధ్యాపకులు వారికి భిన్నమైనవారు. వారి నోరు నొక్కితే భిన్నాభిప్రాయం బెడద సమసిపోతుందని పాలకులు భావిస్తున్నారు.
ఈ విష యంలో అధ్యాపకుల తరఫున మాట్లాడి విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన యూజీసీ... ప్రభుత్వ మనోగతాన్ని అధ్యాపకులపై రుద్దాలని చూస్తోంది! ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి నిరసనలంటే మొదటినుంచీ వెగటే. అమరావతి దరిదాపుల్లోకి అది చేరకుండా ఆయన కట్టడి చేశారు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచివాలయం సమీ పంలో ఉండే నిరసన వేదిక ఇప్పటి ధర్నాచౌక్‌కు తరలడం ఆయన నిర్వాకమే. ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పక్షం తన ఇష్టానుసారం పరిపాలించడం కాదు. అది చట్టసభలో విపక్షం వ్యక్తం చేసే అభిప్రాయాలతోపాటు, దాని వెలుపల ఉన్న విశాల ప్రజానీకం మనోభావాలను గుర్తించడం కూడా. చలనశీలమైన సమష్టి మేధోమథనం ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది తప్ప అందరి నోళ్లూ నొక్కి ప్రశాంతత నెలకొల్పడం ద్వారా కాదు. ఎవరూ ధర్నాలు, నిరసనలు చేయనవసరం లేని పరిస్థితులు ఏర్పరిచేందుకు చిత్తశుద్ధితో పాటుపడ దామనుకుంటే మంచిదే. అంతేతప్ప వాటిని నిషేధిస్తామని, ఊరు వెలుపలకు గెంటేస్తామని అన డం అప్రజాస్వామికమవుతుంది. హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు విలువైనవి. అవి దేశంలోని పాలకులందరూ పరిగణనలోకి తీసుకోదగ్గవి.
Comments
Please login to add a commentAdd a comment