
‘నాలుకలు చీరేస్తారు.. జాగ్రత్త’
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్దని స్థానికులు పదేళ్లుగా కోరుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళనలు చేస్తామంటేనే ఈ రోజు కార్యక్రమానికి పోలీస్లు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఆందోళనకారులు ఐరన్ పైపులతో వచ్చారని ఆరోపించారు.
తాము ఎవరినీ సమీకరించలేదని.. తలుచుకుంటే పది లక్షల మందిని అక్కడకు రప్పించ గలిగేవాళ్లమని చెప్పారు. విపక్షాల దౌర్జాన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలనీ వాసులను ధర్నా చౌక్‌కు రావద్దని ఒత్తిడి తెచ్చినా వారు ఆవేదన చెప్పుకోవడానికి వచ్చారని తెలిపారు. విపక్షాలను ప్రజలు చీదరించుకుంటున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం దుర్మార్గం అన్నారు. సీఎం కుటుంబ సభ్యులను ఇలాగే ఏకవచనంతో సంభోదిస్తే ప్రజలు నాలుకలు చీరేస్తారని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా విపక్షాలు పద్దతి మార్చుకోవాలని సూచించారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలకు అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు.