‘ధర్నా దుర్గ’ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన దుర్గ ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయలేదు. సింగిల్ నినాదం కూడా చేయలేదు. అయితే ఆమె నవ్వులు మాత్రం ధర్నా చేయకపోయినా హల్‌చల్ చేస్తాయి. నాప్‌స్టాప్‌గా నవ్వేలా చేస్తాయి...
ఫ్యామిలీ ఫంక్షన్‌లలో ఏం ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేక పోయినా దుర్గ ఉండాల్సిందే. ఎందుకంటే దుర్గ ఉన్నచోట ‘హాహాహో’లతో కూడిన భారీ నవ్వుల వర్షం కురుస్తుంది. ఆ నవ్వుల వర్షంలో తడిసిపోవడానికి చుట్టాలు పక్కాలు అమిత ఉత్సాహం చూపుతారు.
ఆ నవ్వుల బలంతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకుంది దిల్లీకి చెందిన ధర్నా దుర్గ.
నిజజీవితంలోని సంఘటనల చుట్టూ హాస్యాన్ని అల్లుకునే ధర్నా దుర్గకు సామాజిక మాధ్యమాలలో భారీ అభిమాన గణం ఉంది.
హీరోయిన్‌ల గొంతును అనుకరించడం తన ప్రత్యేకత. సారా అలీఖాన్ గొంతును అద్భుతంగా అనుకరిస్తుంది. సారా ఫేవరెట్ డైలాగ్ ‘నమస్తే దర్శకో’పై ఫన్నీగా వీడియో చేసింది దుర్గ. ఈ వీడియో చూసి సారా అలీఖాన్ ముచ్చటపడడమే కాదు, దుర్గను మెచ్చుకుంటూ వీడియోను పోస్ట్ చేసింది.
కరోనా కల్లోలంలో, ఇంటికే పరిమితం కావాల్సిన అనివార్యత వల్ల చాలామందిలాగే దుర్గ కూడా బోర్‌గా ఫీలైంది.
దాని నుంచి బయటపడడానికి సెలబ్రిటీలను అనుకరిస్తూ సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇవి తన స్నేహితులకు తెగ నచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వాటికి అనూహ్యమైన స్పందన లభించేది. ఇక అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తలపై ‘కామెడీ క్వీన్’ అనే కిరీటం వచ్చి చేరింది.
‘ఈ వీడియోలు ఏమిటో, లైక్‌లు ఏమిటో!’ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసేవారు దుర్గ తల్లిదండ్రులు. వారికి అన్నీ ఓపికగా చెప్పేది దుర్గ.
తమ చుట్టాలు పక్కాలలో ‘ఫస్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా తొలి గుర్తింపు తెచ్చుకుంది దుర్గ.
నాటక రంగ నేపథ్యం ఉన్న దుర్గకు లోతైన పరిశీలన శక్తి ఉంది. అది తాను చేసే ఫన్నీ వీడియోలకు ఎంతో ఉపయోగపడుతుంది.
రియాలిటీ షోలపై దుర్గ వేసే ఫన్నీ పంచ్‌లకు నవ్వు ఆపుకోవడం చానా కష్టం. ‘బిగ్ బాస్’లాంటి ప్రసిద్ధ రియాలిటీ షోల నుంచి క్యారెక్టర్లను అల్లుకొని ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది.
నృత్య నైపుణ్యం దుర్గ అదనపు బలం.
కొరియోగ్రాఫర్‌లపై ఫన్నీ వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె చేసిన డ్యాన్స్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘డ్యాన్సర్ ధర్నా దుర్గ’గా పేరు తెచ్చుకుంది.
వేలాదిమందిని నవ్విస్తున్న ధర్నా దుర్గ... ‘నవ్విస్తే ఇంత పేరు వస్తుందని తెలియదు’ అంటోంది నవ్వుతూ!
Comments
Please login to add a commentAdd a comment