ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నేతల అరెస్టు
► సీఎంకు వినతిపత్రం ఇవ్వాలనుకున్న ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు
► మఖ్దూం భవన్‌లో కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఇందిరా పార్కువద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేయవద్దని కోరేందుకు సీఎం కేసీఆర్‌ను కలసి వినతి పత్రం ఇవ్వాలనుకున్న ‘ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ’ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గురువారం ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలవనున్నామని కమిటీ నేతలు ప్రకటించిన వెంటనే సీపీఎం, సీపీఐ కార్యాలయాల వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిని విడుదల చేశాక సీపీఐ కార్యాలయం మఖ్దూం భవన్‌లో ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం అయ్యింది.
ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరు 10 వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. కోదండ రామ్ మాట్లాడుతూ..ధర్నా చౌక్ ఎత్తివేసినప్పట్నుంచీ ప్రగతి భవన్ ధర్నాభవన్‌గా మారిందన్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఈ నెల 22న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని, ప్రతిపక్ష పార్టీల నేతలనూ ఈ ధర్నాకు ఆహ్వానించామన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం పోలీసులతో అణచివేయిస్తుందన్నారు.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని, రజకార్ల కంటే అధ్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. ధర్నాచౌక్ మార్చడానికి కారణాలు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే మేధావుల సదస్సులో మేధావులందరినీ ఏకం చేస్తామన్నారు. అనంతరం చాడా మాట్లాడుతూ..ధర్నాచౌక్ పరిరక్షణ కోసం వినతిపత్రం సమర్పించేందుకు కూడా సీఎం అవకాశం ఇవ్వడం లేదన్నారు.
నిరంకుశంగా వ్యవహరిస్తోంది :నారాయణ
వామపక్ష పార్టీల నేతల అరెస్టును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. కార్యాలయాల్లోకే వచ్చి అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలవడమనేది కలలో కూడా తలవద్దనే సందేశాన్ని కేసీఆర్ ప్రభుత్వం పంపుతోందని, ఇది నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పరుగెత్తిన చాడ
ధర్నాచౌక్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ.. సీఎంను కలసి వినతి పత్రం ఇవ్వాల నుకున్న ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మఖ్దూం భవన్ నుంచి కారులో బయటకు వెళ్లేందుకు బయటకు రాగా ప్రధాన గేటు వద్దే పోలీసులు కారుని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే చాడ కారు దిగి పరుగెత్తుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు.