ధర్నాలకు అనుమతి లేదనడం దారుణం
సాక్షి, హైదరాబాద్: భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కుపై ఉక్కుపాదం మోపుతూ ధర్నాచౌక్‌ను ఎత్తివేసి, హైద రాబాద్‌లో ధర్నాలకు అనుమతి ఇవ్వక పోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విమర్శించింది. జిల్లాల్లో ఉద్యమకారులు, వివిధ సంఘాల, పార్టీల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది.
బుధవారం మఖ్దూంభవన్‌లో కందాళ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయకపోగా ప్రజల ప్రజాస్వామికహక్కులపై దాడి చేయ డాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదిం చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసుల దాడులు తీవ్ర మవుతున్నాయని ధ్వజమెత్తారు. భూమి హక్కు పట్టాల కోసం ఉద్యమిస్తున్న పేదలు, పోడు సాగుచేసుకుంటున్న బడుగులపై పోలీసులు దాడులుచేసి కేసులు పెట్టడాన్ని ఖండించారు.