
బతుకు.. బర్‌బాద్!
ధర్నాచౌక్ తరలింపు నిర్ణయంతో చితికిన బడుగు జీవితాలు
అది వేనవేల గొంతుకల ధిక్కార ప్రాంతం.. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమ్మె హక్కుకు చిరునామా.. విద్యా ర్థుల బిగిపిడికిలి బావుటా.. మహిళా సంఘాలు, ఆశవర్కర్లు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల ప్రకటనకు వేదిక.. అదే కూతవేటు దూరంలోని పాలకుల చెవిని సోకేలా నినదిస్తూ నిత్య సందడితో కనిపించే ధర్నాచౌక్!! ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలించాలన్న నిర్ణయంతో.. ఆ గల్లీతో పెనవేసుకున్న పేదల బతుకులిప్పుడు బజారున పడ్డాయి.
నినాదాలతో పొడిబారిన గొంతులకు నిమ్మకాయ సోడా ఇచ్చే యాదగిరి బండి, కొబ్బరినీళ్లతో సేదదీర్చే రాజరాజేశ్వరి, నినాదాలను మోసుకొచ్చే ఫ్లెక్సీ బాయ్ లింగస్వామి, నినాదాలను ప్రతిధ్వనించే ఎస్‌డీఎస్ సౌండ్ సిస్టమ్ ఇబ్రహీం, వైఎస్సార్ పాదయాత్ర మొదలుకొని, కేసీఆర్, కల్వకుంట్ల కవిత, హరీశ్‌రావు లాంటి ఎందరో రాజకీయ నేతలకు 16 ఏళ్లుగా తన టెంట్‌తో నీడనిచ్చిన సాయి టెంట్ హౌజ్ వెంకటేశ్, ఎండనకా, వాననకా అతిచౌకగా అన్నం వండి వార్చి ఉద్యమకారుల ఆకలి తీర్చిన సాయి తిరుమల మెస్, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సలీం బజ్జీ బండి, రాజేశ్ చాయ్‌బండి, పాన్‌షాప్ గణేశ్, టీ వాలాలు, సిగరెట్ టేలాలూ అన్నీ ఇప్పుడు ధర్నా చౌక్‌తోపాటే మూగబోయాయి! మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. వారి అరిగోసకు అక్షర రూపం ఈ కథనం... – సాక్షి, హైదరాబాద్
పని దొరుకుడు కష్టమైంది
మాది భువనగిరి దగ్గర జంపల్లి. ఇంటర్ వరకు చదివిన. ముగ్గురు చెల్లెళ్లు, అమ్మను నేనే చూడాలి. నాన్న లేరు. పనికోసం హైదరాబాద్‌కొచ్చిన. పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు ధర్నాచౌక్‌లో ఫ్లెక్సీలు ఫిట్ చేయడం నా పని. అందుకు మా ఓనర్ నాకు రోజుకి రూ.450 ఇస్తాడు. కానీ ఇప్పుడు పని దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు నెలరోజులు దొరికేటిది.ఇప్పుడు పది రోజులే దొరుకుతంది. నాలాంటి కూలీలు వేలమంది ఉన్నారు. – లింగస్వామి, ఫ్లెక్సీ బాయ్
ఇప్పుడెక్కడికి పోవాలె?
నేను వరంగల్ నుంచి వచ్చాను. 18 ఏళ్ల నుంచి ఈ ధర్నా చౌక్‌లనే ఉంటున్న. ఇప్పుడె క్కడికి పోవాలె? పొద్దునొచ్చి, రాత్రిదాక ఇక్కడే సోడాలు అమ్ముత. వైఎస్ గారి పాద యాత్రప్పుడు మొదటిసారిగా సోడా బండి కొనుక్కున్న. ధర్నాచౌక్ ఉన్నప్పుడు రూ.వె య్యి దాకా ఉండే గిరాకి ఇప్పుడు సగం కన్నా తక్కువైంది. ఏం జేయాల్నో తెలుస్తలేదు. – యాదగిరి, నిమ్మ సోడా బండి
మా బతుకులే పోయినయ్
ధర్నాచౌక్ పోయినంక మా బతుకులే పోయినయ్. గరీబోల్లకి ఏం బిజినెస్ చేయొస్తదమ్మ? బజ్జీలేసుకున్డు దప్ప. గదిగూడ ఏసుకోకుంటైపాయె. ధర్నా చౌక్ ఉన్నప్పుడు పది కిలోల బజ్జీపిండితోని బజ్జీలేసేటోణ్ణి. ఇప్పుడు 2 కిలోల పిండి కూడా ఒడుస్తలేదు.
– సలీం, బజ్జీ బండి నిర్వాహకుడు
రోజుకు 800 వచ్చేవి..
నేను నడవ లేను. 85 శాతం వైకల్యంతో ఏం పనిచేయొస్తది? అందుకే ఫ్రెండ్ బండి దగ్గర చాయ్‌లమ్ము తున్న. అప్పుడు ధర్నా లు జేసేటోళ్ళు వచ్చేది కాబట్టి రోజుకి S 7, ఎనిమిదొందలొచ్చేటియి. ఇప్పుడు 200 కూడా దొరుకుతలేవు.
– రాజేశ్, చాయ్‌బండి
ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే
ఇక్కడ పదహారేళ్లుగా టెంట్ హౌస్ నడుపుతున్నా. ఇన్ని రోజులు ధర్నాచౌక్‌ను నమ్ముకొని బతికిన. బిడ్డలిద్దరిదీ ఇంటర్ అయిపోయింది. కొడుకు టెంత్ అయింది. బిడ్డలని ఇంజనీరింగ్ చదివించాలను కున్నాను. కానీ ధర్నా చౌక్ ఎత్తేసినంక మొత్తం బతుకేపోయింది. దుకాణానికి రూ.5,500 అద్దె కూడా కట్టలేకపోతున్నాం. షాప్ ఎత్తేయాలనుకుంటున్నా. ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే. డిగ్రీలో చేర్పిస్తాన్న. కేసీఆర్, హరీశ్‌రావు, కల్వకుంట్ల కవిత అందరికీ టెంట్లు మోసినం. అయినా యిప్పుడు ఫాయిదా లేదు! – వెంకటేశ్, సాయిరాం టెంట్ హౌస్
బిజినెస్ మొత్తం పడిపోయింది
మేం కూడా టీఆర్‌ఎస్సే. అయితే ధర్నాచౌక్ బోయినంక బిజినెస్ మొత్తం పడిపోయింది. రూ.40 ఇస్తే కడుపునిండా అన్నం పెట్టెటోళ్లం. రోజుకి నాలుగైదు వేలొచ్చేటియి. యిప్పుడు వెయ్యి కూడా బిజినెస్ జరగట్లేదు.
– రాజు, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్
ఇంటి కిరాయికి కూడా డబ్బులు రావడం లేదు
మేమిద్దరం రోజంతా పనిచేస్తే ఐదారొందల కొబ్బరి బోండాలు అమ్మే వాళ్లం. ఇప్పుడు 100 కాయలు కూడా అమ్ముడుకావడం లేదు. ఇంటి కిరా యికి కూడా డబ్బులు రావడం లేదు.
– రాజేశ్వరి, రాజబాబు కొబ్బరి బోండాం బండి
మా షాపు నాయినే ఓపెన్ చేశారు
ఇక్కడ మా నాన్న పాన్‌టేలా నడుపుతడు. గిరాకీ సగం పడిపోయింది. మేమంతా టీఆర్‌ఎస్సే. ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ షాప్ ఓపెన్ చేశారు. ధర్నా చౌక్ ఎత్తివేసినంక నష్టంమొస్తున్న మాట నిజమే. ప్రభుత్వం ఏంజేసినా ప్రజల కోసమే అని ఇంకా నమ్ముతున్నం.
– గణేశ్, పాన్‌షాప్