అందుకే కమ్యూనిస్టులు విధ్వంసం సృష్టించారు: కర్నె
Published Mon, May 15 2017 4:18 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు విధ్వంసం సృష్టించారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన హింసకు వామపక్షాలే బాధ‍్యత వహించాలన్నారు. ఈ ఘటనలను టీఆర్‌ఎస్‌ఎల్‌పీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. తాము అనుకున్నట్టే హింస జరిగినందుకు కమ్యూనిస్టులు సంతోషిస్తున్నారన్నారు. ధర్నా చౌక్ వ్యవహారం కోర్టుల్లో ఉందని, ధర్నా చౌక్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ధర్నా చౌక్ ను ఆక్రమించడానికి అదేమైనా వస్తువా ? అని ప్రశ్నించారు. పేదలకు స్థలాల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వాటిని బడా వ్యక్తుల కట్టబెట్టింది ఎవరో అందరికి తెలుసునన్నారు.
ధర్నా చౌక్‌ను వ్యతిరేకిస్తుంది గత పది సంవత్సరాలుగా స్థానిక ప్రజలేనని స్పష్టం చేశారు. కాలనీ వాసులను, వాకర్స్ ను గాయపరిచే హక్కు విపక్షాలకు ఎక్కడిది ? సూటిగా అడిగారు. ప్రజలను హింసించే హక్కు విపక్ష నేతలకు ఎవరు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు సూది దప్పడం దాడుల నైజాన్ని మరో సారి చాటుకున్నారని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన నాయకులను దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేకే ఈర్ష్యతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. కోదండరాం, రేవంత్, ఉత్తమ్, తమ్మినేనిలు ఈ రోజు జరిగిన ఘటనపై ప్రజలకు క్షమాపాణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద వేర్వేరు సంస్థలు ఓకే రోజు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయని, విపక్షాలకు ఏ అంశం లేకనే ధర్నా చౌక్ అంశాన్ని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement