ధర్నాచౌక్‌ను తొలగించాలి..
- ధర్నాచౌక్‌తో అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికుల ఆరోపణ
- స్థానికులతో టీఆర్‌ఎస్ నేతల మంతనాలు
సాక్షి, హైదరాబాద్: విపక్షాల ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు రోజులుగా టీఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్లు.. ధర్నాచౌక్‌తో ఇబ్బంది పడుతున్న ఎల్‌ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, బీమానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జలవాయుటవర్స్, ఇండియన్ బుల్స్ అపార్ట్ మెంట్, ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మంతనాలు సాగించారు. ఆదివారం ఉదయం వాకర్స్ అసోసియేషన్‌తో పాటు బండమైసమ్మనగర్ బస్తీ ప్రతినిధులతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
ధర్నాచౌక్‌తో నిత్యం ఇబ్బందులే...
ధర్నాచౌక్‌తో తాము నిత్యం అసౌకర్యానికి గురవుతున్నామని ఇందిరాపార్క్ పరిసర కాలనీల వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైక్‌లతో శబ్ద కాలుష్యం, అటూ, ఇటూ బారీకేడ్లు వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. అప్పుడప్పుడు పోలీసుల లాఠీ చార్జీ జరిగినప్పుడు తప్పించుకొనేందుకు ఆందోళనకారులు తమ ఇండ్లలోకి వస్తున్నారని తెలిపారు. ఆయా వర్గాల ఆందోళనలకు, ధర్నాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఎవరికీ అసౌకర్యం కలగకుండా వేరే ప్రాంతంలో ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేయాలని బీమా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,, కార్యదర్శులు పి.కుమార్, సతీశ్, జలవాయు టవర్స్ అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, ఇండియన్ బుల్స్ అపార్టుమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు ప్రభుత్వాన్ని కోరారు.