
ధర్నా శివార్..!
► ధర్నా చౌక్‌ను నగర శివారుకు మార్చాలని
పోలీసు శాఖకు ప్రభుత్వ ఆదేశం
► ఇందిరాపార్క్ వద్ద 16 ఏళ్లుగా సాగుతున్న
నిరసనల ప్రస్థానానికి త్వరలో తెర
► శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్య నేపథ్యంలోనే..
► 30 ఎకరాల్లో ప్రత్యామ్నాయ ప్రదేశం గుర్తించాలని సూచన
► మియాపూర్, ఉప్పల్, నాగోల్, రాజేంద్రనగర్‌లలో పోలీసుల స్థలాన్వేషణ
► అన్ని సదుపాయాలతో నిరసనలు జరుపుకునేలా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్ : వివిధ వర్గాల ప్రజలు రాజధానిలో తమ నిరసన గళం వినిపించేందుకు చిరునామాగా నిలిచిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రాంతం త్వరలో మూగబోనుంది. విద్యార్థి, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళనలు జరుపుకునేందుకు ఉన్న వేదిక మరోచోటుకు తరలివెళ్లనుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నగరం మధ్యలో ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివారుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా త్వరితగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ధర్నా చౌక్ కోసం ఇతర ప్రాంతాల్లో స్థలం వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
16 ఏళ్లుగా అదే వేదిక...
ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరం వరకు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఆందోళనలు జరిగేవి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్కడే నిరసన తెలిపేవారు. అయితే చంద్రబాబు హయాంలో సచివాలయం వద్ద ధర్నాలు, ఆందోళనలు చేయకూడదంటూ ఆదేశించి మరోచోటుకు తరలించాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తమ అనుమతితో ధర్నాలు, నిరసనలు చేసుకోవచ్చని అప్పటి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాపార్క్–డీబీఆర్ మిల్స్ రోడ్‌ను ధర్నా చౌక్‌గా ఏర్పాటు చేశారు. ఉద్యమాలు, నిరసనలు అక్కడే జరిగేవి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా కొనసాగుతున్న ధర్నా చౌక్ ప్రస్థానం అతి త్వరలో ఇందిరా పార్క్ వద్ద ముగియనుంది.
నగర శివారులో 30 ఎకరాల్లో...
సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ.. ఇలా ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నీ సెంట్రల్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ పరిధిలోనే ధర్నాల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా నిరసనకారులు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేవారు. అయితే ఇక ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్‌ను తరలిస్తే ఎక్కడ పెడతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మియాపూర్, నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, సాగర్ రోడ్, రాజేంద్రనగర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 25 నుంచి 30 ఎకరాల్లో ధర్నా చౌక్‌ను విశాలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, బహిరంగ సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇలా ప్రతి కార్యక్రమాన్నీ అన్ని సదుపాయాలతో అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాధికారులకు సమస్యలు చెప్పుకునేందుకు ఉన్న ‘దగ్గరి ప్రాంతం’ నుంచి శివారుకు ధర్నా చౌక్‌ను తరలించాలనుకోవడంపై కొంత నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ధర్నా చౌక్‌ను ఇందిరా పార్క్ వద్ద నుంచి తరలించాలా లేక అదే ప్రాంతంలో కొనసాగాలించాలా అనే అంశంపై గతంలో మూడు అసెంబ్లీ హౌస్ కమిటీలు ఏర్పాటైనప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి.
గతంలోనే హైకోర్టులో పిటిషన్...
ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ వల్ల తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యం పోలీసు చర్యలతో విసిగిపోతున్నామని ఆ ప్రాంత సమీపంలోని ఎల్‌ఐసీ కాలనీ అసోసియేషన్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆందోళనల సమయంలో పోలీసులు అక్కడి రోడ్డు మార్గాన్ని మూసేస్తుండటం వల్ల తాము ఇళ్లకు వెళ్లేందుకు గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ అసోసియేషన్ తమ పిటిషన్‌లో పేర్కొంది. అందువల్ల ధర్నా చౌక్‌ను తమ నివాసాల పరిసరాల నుంచి తరలించాలని కోర్టును కోరింది. దీనిపై పోలీసు శాఖ కౌంటర్ వేసినా హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఎల్‌ఐసీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.