అవసరమైతే ఉద్యమానికి సిద్ధం: కోదండరాం
ప్రజా సమస్యలపై ఇక అవసరమైతే ఉద్యమం చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై తాము సీరిస్‌గా చర్చించినట్లు తెలిపారు. భూసేకరణ 2013 చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని, దీనికి నిరసనగా ఈనెల 29న హైదరాబాద్‌లో ధర్నా చేస్తామన్నారు. విద్యాసంస్థల పరిరక్షణ, ఉపాధి, ఉద్యోగాలపై ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ర్యాలీలు, ధర్నా, అధ్యయన యాత్ర ఉంటాయని తెలిపారు. అలాగే మార్చి నెలలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన ఉంటుందన్నారు. ఏప్రిల్ నెలలో కుల వృత్తులు, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం చేస్తామని తెలిపారు.
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు విడుదల చెయ్యాలని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చెయ్యాలని, వ్యవసాయ విధానం ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే.. ఆదివాసుల భూములు లాక్కోవద్దని, రాజకీయాల్లో విలువలు పాటించాలని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, స్పీకర్ తన హోదాను కాపాడుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో సిటిజన్ చార్టర్‌ను పాటించాలని కోరారు. రాజకీయ నాయకులను లోకాయుక్త పరిధిలోకి తేవాలని చెబుతూ... జోనల్ వ్యవస్థ రద్దు మంచిది కాదని, దీనిపై నిపుణుల కమిటీ వెయ్యాలని సూచించారు. ప్రజలకు జేఏసీపై విశ్వాసం ఉందని, ఇది రాజకీయ వేదిక కాదని తెలిపారు. ఇప్పుడు జేఏసీలో ఉన్నవారిలో ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కూడా ఆ తర్వాత సైతం జేఏసీ ఉంటుందని స్పష్టం చేశారు. పాలకుల ఇష్టాన్ని బట్టి కాకుండా, ప్రజల అవసరాలను బట్టి పాలన సాగాలని తెలిపారు. ఒక డాక్టర్‌తో పని కాకుంటే ఇంకో డాక్టర్ దగ్గరకు ఎలా వెళ్తామో రాజకీయాలు కూడా అంతేనని చెప్పారు.