కిరీటాలు.. పీఠాలు అడగడం లేదు
అమరుల స్ఫూర్తి యాత్ర’లో ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, సంగారెడ్డి: ‘నెత్తిమీద కిరీటాలు.. కూర్చోడానికి పీఠాలు.. సన్మానాలు, దండలు కోరుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజ లకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మాత్రమే ప్రశ్నిస్తున్నం’అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. తెలంగాణ జేఏసీ చేపట్టిన ‘అమరుల స్ఫూర్తియాత్ర’ను బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కోదండరాం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చింది.. నువ్వెవరు? అని అడుగుతున్నారు.. అయినా మేం గుర్తింపు కోరుకోవడం లేదు’అన్నారు. ‘లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడికి పోయింది. రైతు ఆత్మహత్యల్లో రెండోస్థానం, నిరక్షరాస్య తలో అట్టడుగున ఉన్నాం. దళితులకు ఇప్పుడు ఇస్తున్నట్లే భూమి పంపిణీ చేస్తే.. అందరికీ లబ్ధి కలగాలంటే ఇంకో 230 ఏళ్లు పడుతుంది. ఇదేం పద్ధతి.. మీకు అవసరమైతే మాత్రం భూములు దొరుకుతున్నాయి.
మియాపూర్ భూములు పంచుకోవడం, కాంట్రాక్టులు తెచ్చుకోవడం, పైసలు దండుకోవడంలోనే నాయకులు మునిగి తేలుతున్నారు. ఎవరిపైనైతే కొట్లాడినమో.. వారికే పైసలు దొరుకుతున్నయి. ఓట్లు అడిగేందుకు మాత్రమే ప్రజలు అక్కరకు వస్తారా?’అని కోదండరాం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. 20 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకం పనులను రూ.16 వేల కోట్లతో పూర్తి చేయొచ్చు. కానీ రూ.46 వేల కోట్లతో పనులు చేస్తున్నరు.’ అని కోదండరాం పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ కో కన్వీనర్ ప్రొఫెసర్ పురుషోత్తం, జిల్లా కో ఆర్డినేటర్ పల్పనూరు శేఖర్, ఆశ తదితరులు పాల్గొన్నారు.