కోదండరాం పార్టీ పెట్టకపోవచ్చు: భట్టి
బాహుబలి ఊహాజనితం.. చర్చ అనవసరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను రాజకీయ నాయకునిగా తాము భావించడం లేదని, ఆయన పార్టీ పెట్టకపోవచ్చునని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఎవరు కొత్త పార్టీ పెట్టినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తే అధికారంలో ఉన్నవారెవరికీ మరోసారి అధికారం ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడటంలేదని తేలిందన్నారు.
ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజలు ఆశించినట్టుగా లేదని, 4కోట్ల మందికి దక్కాల్సిన వనరులను, సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోని నలుగురే దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాల్సిన అవసరంలేదని భట్టి అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీయాలని మా ఎమ్మెల్యేలు అనుకున్నా అధికారపక్షం మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. రెండు మూడు రోజులుగా పార్టీలో సంచలనం సృష్టించిన బాహుబలి విషయం ఊహాజనితంగా భట్టి తేల్చేశారు. దాని గురించిన చర్చ అనవసరమని వ్యాఖ్యానించారు.