'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్'
టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మాజీ ఉప సభాపతి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను ఇంతకుముందే కోరామని ఆయన చెప్పారు. ఈ అంశంపై విచారణలో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ను కోరుతామన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు సభలో ప్రతిపక్షానికి కేటాయించిన బ్లాకులో కాకుండా అధికార పక్షానికి కేటాయించిన బ్లాకులో కూర్చోవడమే వారు పార్టీ ఫిరాయించారనడానికి సాక్ష్యమన్నారు. దీన్ని సాక్ష్యంగా పరిగణించి వారిపై అనర్హత చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరుతామన్నారు. ఆయనే నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నామని, ఒకవేళ అలా చేయకపోతే రాజ్యాంగపరంగా ప్రత్యామ్నాయ అంశాలను ఆశ్రయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.