సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల సాధనకు ఇదే సరైన సమయమని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సంసిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే నేపథ్యం, టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే నిర్ణయం తమకు కలిసి వస్తుందని టీచర్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది ఉపాధ్యాయులు, 4 లక్షల మంది కుటుంబసభ్యులున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో వీరి పాత్ర లేకున్నా, ఎంతోకొంత ప్రభావం ఉంటుందనేది వాస్తవం. దీంతో ప్రభుత్వం ముందున్న తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయ సంఘాలు పావులు కదుపుతున్నాయి. విద్యాశాఖలో దాదాపు 20 వేల ఖాళీలుండగా, 10 వేల మందికి తక్షణ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకం అవసరం ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు ఏడేళ్లుగా బదిలీలు కోరుకుంటున్నారు.
ఎవరి వ్యూహం వారిదే
ప్రభుత్వంతో సత్సంబంధాలతో ముందుకెళ్లే సంఘాలు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వారం రోజుల్లో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు యత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులు ఇస్తే ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల మరింత సానుకూల ధోరణితో ఉండే వీలుందని సంఘాల వారు నచ్చజెప్పాలనుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయొచ్చని, దీంతో లక్షల మంది ఉపాధ్యాయ కుటుంబాల్లో నమ్మకం పెరుగుతుందని వివరించాలనే యోచనలో ఉన్నారు.
కొన్ని సంఘాలు విపక్షాలతో కలిసి దీన్నో రాజకీయ అంశంగా మలిచే అవకాశం ఇవ్వకూడదనే ధోరణిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాయి. ఇదిలాఉంటే, బదిలీలు, పదోన్నతులపై ఇంతకాలం ఆందోళనలు చేసిన సంఘాలు, వీటిని మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఇలాంటి సమయంలో ఆందోళనల తీవ్రత పెరగకూడదనే ఆలోచనలో ఉంటుందని, కాబట్టి తమ పోరాటాలకు తలొగ్గే అవకాశముంటుందని భావిస్తున్నారు.
వివరిస్తాం.. సాధిస్తాం
బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మొదట్నుంచీ మా సంఘం ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. వచ్చే వారం మరోసారి ఈ వ్యవహారంపై సర్కార్ పెద్దలను కలిసి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం. ఉపాధ్యాయ కుటుంబాలకు సర్కార్ సానుకూలంగా ఉందనే సంకేతాలు అందిస్తాం.
– బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్‌టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పోరాటంతోనే సాధన
బదిలీలు, పదోన్నతులు సాధించేందుకు ఇప్పటివరకు ఎన్నో పోరాటాలు చేశాం. ఇప్పుడు దీన్ని మరింత ఉధృతం చేస్తాం. త్వరలోనే ఉపాధ్యాయ ఐక్య పోరాట వేదిక సమావేశమవుతుంది. కలిసి వచ్చే సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. ఉపాధ్యాయ సమస్యల సాధనలో కొత్త తరహా ఆందోళనలు చేపడతాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.
– చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment