మద్దతు కూడగట్టే పనిలో సంఘాలు
ఈసారి పీఆర్‌టీయూ నుంచి పరిశీలనలో రవీందర్, శ్రీపాల్‌రెడ్డి పేర్లు
యూటీఎఫ్ నుంచి రెండోసారి పోటీకి నర్సిరెడ్డి ఆలోచన
బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా పోటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి.
2025 మార్చి 29తో వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30న ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బలం పెంచుకునేందుకు....
రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి తమ సంఘం నుంచి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పీఆర్‌టీయూ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. యూటీఎఫ్ కూడా అదే పనిపై దృష్టి సారించింది.
నెల రోజుల నుంచి సంఘ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తోంది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పీఆర్‌టీయూ ఉంది. సంఘంలోని నాయకుల్లో ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సంఘాన్ని వీడిన, సంఘం నుంచి సస్పెండ్ చేసిన నేతలను కూడా మళ్లీ చేర్చుకుంటోంది.
ఇందులో భాగంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో పీఆర్‌టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని సస్పెండ్ చేసిన సుంకరి బిక్షంగౌడ్‌తోపాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వారిని తిరిగి చేర్చుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇక యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ కూడా ఈనెలాఖరు వరకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి.
త్వరలోనే పీఆర్‌టీయూ అభ్యర్థుల ఖరారు
పీఆర్‌టీయూ ప్రస్తుతం జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిని ఈనెలాఖరులోగా పూర్తి చేసి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వచ్చే నెల 7న నిర్వహించాలని నిర్ణయించింది. అందులో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తరఫున పోటీలో ఉండే వారి పేర్లను ఖరారు చేసే అవకాశముంది.
వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేయగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పులి సరోత్తంరెడ్డి రెబెల్‌గా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం పీఆర్‌టీయూ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావిస్తున్నట్టుగా సంఘంలో చర్చ సాగుతోంది.
మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్‌టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో ఎవరిని ఖరారు చేస్తారన్నది మొదటి వారంలోనే తేలనుంది. మరోవైపు టీపీటీఎఫ్, యూటీఎఫ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది.
ఈసారి పార్టీల నుంచి పోటీ..
టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీ తరఫున కూడా అభ్యర్థులను పోటీలో నిలుపుతారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఈసారి వరంగల్–ఖమ్మం– నల్లగొండ స్థానంలో పోటీచేయాలని పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి భావిస్తున్నారు. ఆయనతోపాటు టీపీయూఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది.
మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ –కరీంనగర్ స్థానంలో బీజేపీ నుంచి నరహరి లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పార్టీ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీచేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment