Dissatisfaction Among Teachers Because Of Transfers And Promotions In Telangana, Details Inside - Sakshi
Sakshi News home page

Teachers Transfers And Promotions: మాస్టార్ల బదిలీలు, పదోన్నతులు ఎప్పుడు? రగులుతున్న అసంతృప్తి

Published Mon, Jul 10 2023 5:09 AM | Last Updated on Mon, Jul 10 2023 8:46 AM

Dissatisfaction among teachers because of Transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముందుకెళ్ళకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటోంది. ఏడాదిగా అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయ సంఘాలు తమతో ఆటలాడుతున్నాయని టీచర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. టీచర్ల సంఘాల నేతలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది.

ఇటీవల విద్యాశాఖ మంత్రిని కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. న్యాయ పరమైన చిక్కులు తొలగించేందుకు విద్యాశాఖ ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. నాన్‌–స్పౌజ్‌ పేరుతో న్యాయ వివాదం సృష్టించిన వ్యక్తుల వెనుక స్వార్థం ఉందని, దీన్ని న్యాయస్థానానికి సరిగా వివరించడంలో విద్యాశాఖ విఫలమైందంటున్నారు. 

హెచ్‌ఆర్‌ఏ కోసమేనా ఈ రగడ? 
భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే చోట ఉండేలా చూడాలనేది ప్రభుత్వ విధానం. ఈ నేపథ్యంలోనే బదిలీలు చేపడుతున్నారు. కానీ కొంతమంది నాన్‌–స్పౌజ్‌ పేరుతో కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు. బదిలీ అయ్యే 80 వేల మంది టీచర్లలో 30 వేల మంది ఉపాధ్యాయులు స్పౌజ్‌ పాయింట్లు వాడుకుని 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వస్తున్నారనేది నాన్‌–స్పౌజ్‌ల వాదన. నిజానికి జిల్లా యూనిట్‌గానే టీచర్ల బదిలీలు ఉంటాయి.

హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో స్పౌజ్‌ అనే అంశంతో సంబంధం లేకుండానే జిల్లాల్లోని అందరికీ ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలోని 5 మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని 3 మండలాలు తప్ప రాష్ట్రంలో మిగిలిన 30 జిల్లాలకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించదు. స్పౌజ్‌ పాయింట్లు 8 ఏళ్ళకోసారి ఇస్తారు. అది కూడా దంపతుల్లో ఒకరికే వర్తిస్తుంది 

వాస్తవాలు గుర్తించరేం? 
వాస్తవాలు అలా ఉంటే నాన్‌ స్పౌజ్‌ల పేరుతో అభ్యంతరాలు లేవనెత్తే వ్యక్తులు అసత్య ప్రచారంతో నమ్మిస్తున్నారనేది మెజారిటీ టీచర్ల వాదన. స్పౌజ్‌లు అందరూ దీన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలను కోరుకుంటే, ఇలాంటి వాళ్ళు 60 వేల మంది వరకు ఉండాలి. కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ గుర్తించడం లేదని టీచర్లు అంటున్నారు. అసలు కోర్టులో వివాదం లేవనెత్తిన వాళ్ళల్లో ఎక్కువ మంది అధిక హెచ్‌ఆర్‌ఏ పొందుతూ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇలా కేసులు వేసి, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఇది స్వార్థం కాదా? : జైపాల్‌ రెడ్డి (స్పౌజ్‌ ఉద్యోగుల నేత) 
వివాదం లేవనెత్తుతున్న నాన్‌ స్పౌజ్‌ల్లో 13 ఏళ్ళకుపైగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 8 మండలాల్లోనే పనిచేస్తున్నారు. వీరికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. ఇందులో చాలా మంది రియల్‌ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి ప్రయోజనం కోసం 80 వేల మంది టీచర్ల బదిలీల ప్రక్రియకు అడ్డం పడుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు. ఇప్పటికైనా వివాదం వెనుక వాస్తవాలు గుర్తించి, బదిలీల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.  

గతేడాది బదిలీల షెడ్యూల్‌ ఇచ్చినా.. 
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గత ఏడాది షెడ్యూల్‌ ఇచ్చింది. అయితే టీచర్లు ఆప్షన్లు ఇచ్చే దశలోనే నాన్‌ స్పౌజ్‌లు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయుల బదిలీలు, సర్వీసుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 309 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించి గవర్నర్‌ ఆమోదంతో జారీ చేయాలని నాన్‌ స్పౌజ్‌లు వాదిస్తున్నారు.

కానీ జీవో 5, శాసనసభ, గవర్నర్‌ ఆమోదం లేకుండా అధికారులే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 162, 163 (3) ప్రకారం గవర్నర్‌ ఇచ్చిన బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం జారీ చేశారని, ఇది చట్టబద్ధం కాదని కోర్టుకు తెలిపారు. దీంతో బదిలీలు, పదోన్నతులపై కోర్టు స్టే విధించింది. ఈ దశలో విద్యాశాఖ వాస్తవాలు చెప్పడంలో విఫలమైందనేది టీచర్ల ఆరోపణ.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement