వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ
అయ్యవార్లు లేక 3,758 యూపీ స్కూళ్లు ఉక్కిరిబిక్కిరి
3– 8 తరగతులకు సబ్జెక్టు టీచర్ల తొలగింపు
ఆందోళనలో ఉన్నత తరగతుల విద్యార్థులు
ఎస్‌జీటీలను ఇస్తామని చెప్పి కేటాయించని విద్యాశాఖ
30 వేల మందిని మిగులుగా చూపించి, 9,075 మందికి స్థాన చలనం
కొన్ని మండలాల్లో భారీగా మిగులు ఉపాధ్యాయులు
లేని స్కూళ్లలో సర్దుబాటు చేయని ప్రభుత్వం
రాష్ట్రంలోని 502 హైస్కూల్ ప్లస్ కాలేజీలకు అన్యాయం
మున్సిపల్ హైస్కూళ్లకు జూనియర్ ఎస్‌జీటీలు.. ప్రాథమిక పాఠశాలలకు సీనియర్ టీచర్లు
జీవో 117 రద్దుతో ప్రభుత్వ బడుల్లో మరిన్ని సమస్యలకు ఆస్కారం
సాక్షి, అమరావతి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యా రంగం పరిస్థితి తయారైంది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమైందో చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి, సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది.
ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి, లేని పాఠశాలల్లో నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మందిని మిగులు చూపించి.. 9,075 మందిని మాత్రమే సర్దుబాటు బదిలీ చేశారు.
అయితే, ఈ ప్రక్రియలో ఎన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉంది.. ఎక్కడ మిగులు ఉన్నారు.. వారిని ఏం చేయాలి.. అనే ప్రాథమిక ఆలోచన కూడా చేయకుండానే విద్యా శాఖ అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3,758 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3–8 తరగతులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, అక్కడున్న విద్యార్థుల బోధనను గాలికి వదిలేశారు. 502 హైస్కూల్ ప్లస్‌లను సర్దుబాటు నుంచి మినహాయించడంతో కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులే లేకుండాపోయారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లకు అనువుగా రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకు వర్తింపజేసి, అత్యంత జూనియర్ ఎస్‌జీటీలను హైస్కూళ్లకు.. ఉన్నత పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు పంపించారు.
విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు
» ఈ విద్యా సంవత్సరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. జూన్ చివరి వారంలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించి, మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి.
దాంతో పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సంఘాలతో సమావేశాలు నిర్వహించి, మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇలా రెండుసార్లు జరగడంతో సెపె్టంబర్ నెలాఖరు దాకా సర్దుబాటు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సర్దుబాటులో తమకు నష్టం జరిగిందని వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాఠశాల విద్య కమిషనరేట్‌కు వినతులు పంపుతున్నారు.
» సర్దుబాటు మార్గదర్శకాల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మందికి మించి విద్యార్థులుంటే స్కూల్ అసిస్టెంట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే తక్కువ రోల్ ఉన్న స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లను హైస్కూళ్లకు బదిలీ చేసి, వారి స్థానంలో ఐదు లేదా ఆరుగురు ఎస్‌జీటీలను సర్దుబాటు చేస్తామన్నారు.
» వాస్తవానికి ఆయా స్కూళ్లల్లో ఉన్న సబ్జెక్టు టీచర్లను బదిలీ చేసినా, వారి స్థానంలో పాఠం చెప్పేందుకు ఒక్క టీచర్‌ను కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని 3 వేలకు పైగా యూపీ స్కూళ్లలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి ఉండడం గమనార్హం. స్కూళ్లల్లో మిగులుగా ఉన్న టీచర్లను లేనిచోటకు పంపించాల్సి ఉంది. అయితే మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో అక్కడ ఉన్న టీచర్లను స్థానికంగానే సర్దుబాటు చేశారు. మిగిలిన టీచర్లను సైతం విద్యార్థులు లేకున్నా అక్కడే ఉంచారు. టీచర్లు లేని చోటుకు పక్క మండలం నుంచి పంపాల్సి ఉన్నా పట్టించుకోలేదు.
జీవో 117 రద్దుకు కూటమి సర్కారు చర్యలు
» పలు సర్వేల అనంతరం విద్యా రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ఒకే విధమైన విధానాలు అనుసరించాలని పేర్కొంది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలంది.
» విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్‌ఈపీ–2020 సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో 117 జారీ చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు.
» 8 వేల మంది అర్హులైన ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన అందించడంతో పాటు ఉపాధ్యాయులపై బోధన ఒత్తిడి తగ్గించేందుకు టీచర్ విద్యార్థుల నిష్పత్తిని 1:20 ఉండేలా చర్యలు తీసుకున్నారు.
» దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఏపీ మోడల్ విద్యా విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం నుంచి 1– 5 తరగతులను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చడంతో పాటు ప్రస్తుతం హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ బోధన పొందుతున్న 3– 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయనుంది.
హైస్కూల్ స్థాయిలో (6–10) ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని నిర్ణయించింది. అంటే ఐదో తరగతి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకేసారి ఆరో తరగతిని ఇంగ్లిష్ మీడియం ఎలా చదవగలరన్న కనీస అవగాహన లేకుండా మార్పులకు శ్రీకారం చుడుతోంది.
మున్సిపల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌ల్లో బోధన గాలికి..
» బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి సమీపంలోనే జూనియర్ కాలేజీ ఉంటే మేలు జరుగుతుందన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో మండల స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలో 502 స్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా మార్చి, ఇంటర్ విద్యను ప్రారంభించారు.
దీంతో గతేడాది 294 బాలికల జూనియర్ కాలేజీలు, మరో 208 కో ఎడ్యుకేషన్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి బోధనకు స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్లను నియమించారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల సర్దుబాటులో హైస్కూల్ ప్లస్‌లను మినహాయించడం, ఉన్న అధ్యాపకుల్లో కొందరు రిటైర్ అవ్వడంతో అక్కడ ఇంటర్ విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది.
» మున్సిపల్ హైస్కూళ్లల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో గత ప్రభుత్వంలో అర్హత ఉన్న సీనియర్ ఎస్‌జీటీలను కొరత ఉన్న హైస్కూళ్లకు డీఈవో కార్యాలయం ద్వారా సర్దుబాటు లేదా డెప్యుటేషన్‌పై నియమించి బోధన అందించారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల కోసం రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకూ వర్తింపజేయడంతో ఇప్పటి వరకు డెప్యుటేషన్‌పై వచ్చి హైస్కూళ్లల్లో బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లల్లో అత్యంత జూనియర్ మిగులు ఉపాధ్యాయులను హైస్కూళ్లలో సర్దారు. దీంతో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
గతంలో జిల్లా స్థాయిలోనే సర్దుబాటు
» విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. జీవో నంబర్ 117 ప్రకారం ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులను విద్యార్థులకు అవసరం ఉన్న చోటుకు జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా పక్క మండలాల స్కూళ్లలోనే సర్దుబాటు చేసేవారు.
» విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా చేసిన ఈ మార్పుతో విద్యా సంవత్సరంలో ఎక్కడా బోధనకు ఆటంకం ఏర్పడలేదు. ఎక్కడా ఉపాధ్యాయుల కొరత అనేది రాలేదు. తాజాగా కూటమి సర్కారు అసంపూర్ణ సర్దుబాటుతో ఈ ఏడాది విద్యా ఫలితాలు అత్యంత దారుణంగా పడిపోతాయని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో రాష్ట్ర టాపర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలవగా, ఈసారి ఆ పరిస్థితి ఉండేలా లేదని చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో విద్యా రంగం నాశనమైంది. బడుల్లో ఉపాధ్యాయులు లేకుండా చేసింది. దాన్ని గాడిన పెట్టడం ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత. అందుకే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోటు నుంచి లేని చోటుకు సర్దుబాటు చేస్తున్నాం. – ఆగస్టులో విద్యా శాఖ మంత్రి లోకేష్, ఉన్నతాధికారులు
కాకినాడ జిల్లా తుని మండలంలో 58 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్టుగా విద్యా శాఖ గుర్తించింది. అయితే సర్దుబాటులో ఒక్కరు కూడా బదిలీ కాలేదు. ఈ మండలానికి పక్కనే ఉన్న రౌతులపూడిమండలంలోని ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలకు గాను.. ఐదు స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను తొలగించారు. పైగా 20 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నా ఒక్కరినీ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment