సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, కోదండరాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
ఉద్యోగులకు సంబంధించిన ఇతర నిర్ణయాలపై కూడా..
గవర్నర్‌తో మాట్లాడి కోదండరాంను మండలికి పంపిస్తాం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సీఎం సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొనసాగింపుపై త్వరలో నిర్ణయం
గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్‌ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు.
బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్!
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు.
తెలంగాణ బాపు జయశంకరే..
తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment