హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటుంది. కొంతమంది సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలే సమైక్యత కోసం పోరాడుతున్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చురుకుగా పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెకు కూడా వారు సంఘీభావం తెలిపారు.
సమైక్యాంధ్ర కోసం 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నాయి. సీమాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు రేపు హైదరాబాద్లో సమావేశం కానున్నారు. 13 జిల్లాల్లో జిల్లా స్థాయి జేఏసీల ఏర్పాటుతోపాటు సీమాంధ్ర స్థాయి జేఏసీని కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలలో జెఏసిలు ఏర్పడ్డాయి. మిగిలిన జిల్లాలలో ఈరోజు ఏర్పడే అవకాశం ఉంది.
ఏపీఎన్జీవోలతో పాటు సమ్మెలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వారికి సీమాంధ్ర విభాగాలు లేకపోవడం, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ జేఏసీలు తీసుకునే నిర్ణయాలకు సర్వీసు రూల్స్‌పరంగా తగిన రక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆలోచనలోపడ్డాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు రాజీనామా చేశారు.
13 జిల్లాల ప్రతినిధులతో బుధవారం హైదరాబాద్‌లో జరిగే కీలక సమావేశంలో సీమాంధ్ర స్థాయి ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
సమ్మెకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
Published Tue, Aug 13 2013 4:06 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement