సాక్షి, హైదరాబాద్: తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక అభివృద్ధి నిధి దారితప్పుతోంది. ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాల్సిన ఈ నిధి ప్రజాప్రతినిధుల అవసరాలు తీర్చేలా తయారవుతోంది. ప్రణాళిక శాఖ పరిధిలోని ప్రత్యేక అభివృద్ధి నిధి (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) కేటాయింపులు నేరుగా ముఖ్యమంత్రి ఆదేశానుసారం జరుగుతాయి. సాధారణంగా ఈ నిధులను గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, రోడ్లు, శాఖలపరంగా కేటాయించని వాటిలో తక్షణ అవసరాలు, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యవసర కార్యక్రమాలకు వినియోగిస్తారు.
కానీ ఈసారి కొత్తగా ఒక గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘ భవనానికి మరమ్మతుల నిమిత్తం కేటాయించడం చర్చనీయాంశమైంది. నారాయణగూడలోని ఓ ఉపాధ్యాయ సంఘ భవనానికి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.86 లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పరిపాలనా అనుమతులిస్తూ ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ ఉత్తర్వుల కాపీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సిఫారసుతో..
నారాయణగూడలోని ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యాలయ భవనానికి మరమ్మతుల నిమిత్తం నిధులు కేటాయించాలంటూ అధికార పార్టీకి చెందిన ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విన్నవించారు. ఎమ్మెల్సీ కాపీకి జతగా సంఘం తరఫున లెటర్‌ప్యాడ్‌తో కూడిన వినతిపత్రాన్ని జోడించారు. దీనికి సంబంధించిన ఫైలు గత నెల 31న ముఖ్యమంత్రికి చేరిన వెంటనే సీఎం సంతకం చేశారు. మరమ్మతులకు సంబంధించిన ఫైలుకు ఒక్కరోజులోనే మోక్షం లభించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధులు కేటాయించిన భవనానికి రెండేళ్ల క్రితమే దాదాపు రూ.76 లక్షలతో మరమ్మతులు చేసినట్లు సమాచారం.
ఈ నిధులను అప్పట్లో సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) కోటాలో సదరు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కూడా రూ.10 లక్షలతో మరమ్మతులు చేశారని సమాచారం. రెండేళ్ల క్రితమే ప్రభుత్వ నిధులతో మరమ్మతులు నిర్వహిస్తే.. మళ్లీ అదే స్థాయిలో నిధులు కేటాయించడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణలో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయంటూ ఉపాధ్యాయ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.
దారితప్పిన ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’!
Published Sun, Sep 9 2018 1:22 AM | Last Updated on Sun, Sep 9 2018 1:22 AM
Comments
Please login to add a commentAdd a comment