సాక్షి, హైదరాబాద్: పాలకులు తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని నియమించాలని, జూలై ఒకటో తేదీతో వర్తించేలా కరువు భత్యం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూయూఎస్పీసీ) డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించింది. దశల వారీగా పోరాట కార్యాచరణను స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఈనెల 18, 19 తేదీల్లో మండలాల్లో బైక్ ర్యాలీలు.
ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామని, సెపె్టంబర్ 1 న చలో హైదరాబాద్ పేరిట రాష్ట్రస్థాయి ఆందోళన నిర్వహిస్తామని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది.
శనివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, జీíపీఎస్, జీఎస్ జిఎల్‌ఐ క్లైములు, పెన్షనరీ బెనిఫిట్స్, బీఆర్సీ బకాయిలు తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఇహెచ్‌ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
తక్షణమే ఉద్యోగాలు.. పదోన్నతులివ్వాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని, తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడిగా అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. పర్యవేక్షణాధికారుల పోస్టులను అవసరం మేరకు మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, పాఠశాలల్లో సర్విస్ పర్సన్స్ ను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని కోరారు.
జీఓ 317 అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి (టీఎస్ యూటీఎఫ్), వై అశోక్ కుమార్, పి నాగిరెడ్డి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి(డీటీఎఫ్), యు పోచయ్య, డి సైదులు (ఎస్టీఎఫ్ టీఎస్), సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్ పిటిఎ), కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి (బీటీఎఫ్), బి కొండయ్య (టీఎస్ ఎంఎస్టీఎఫ్), ఎస్ హరికృష్ణ, వి శ్రీను నాయక్ (టీటీఎ), జాదవ్ వెంకట్రావు (ఎస్సీ ఎస్టీ టీఎ), వై విజయకుమార్ (ఎస్సీ ఎస్టీ యూయస్ టీఎస్) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ సిపిఎస్ రద్దు చేయాలని, 2004 సెపె్టంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment