( ఫైల్ ఫోటో )
ఓరుగల్లు గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తుంటే.. ప్రజాదరణ తగ్గిన నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మెజారిటీ స్థానాల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని సర్వే రిపోర్టులు తేల్చడం సిట్టింగ్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట.
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌కు మొన్నటివరకు కంచుకోట. రెండు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 8 ఎమ్మెల్సీలు, ఆరు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉంది గులాబీ పార్టీ. అయితే తాజా రాజకీయ పరిణామాలతో సీన్ మారి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కలకలం రేపుతోంది. 12 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ బలపడి ఆరేడు స్థానాల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశముందనే సర్వే రిపోర్టు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆరేడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ప్రభావం తప్పవని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి నెలకొని ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందట. దానికితోడు కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోందని, కొంతమంది ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఏక్షణమైనా సదరు నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యానాయక్... ఈ నలుగురు ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉన్నారట. మిగతా ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదని సర్వేల్లో తేలడం సిట్టింగ్‌లకు గుబులు పుట్టిస్తోందట.
మెజార్టీ ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం ఉండడంతో.. అక్కడ అభ్యర్థులను మార్చే అవకాశముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మహబూబాబాద్‌లో ఎంపీ కవిత, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ తూర్పులో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, జనగామలో కేటీఆర్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తాజా సర్వే రిపోర్టులతో ప్రజాదరణ తగ్గిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ బర్త్ డే ను పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మోకాళ్లపై చెల్పూర్ వెంకటేశ్వరస్వామి గుడి మెట్లు ఎక్కి మొక్కులు చెల్లించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భారీ ఖర్చుతో లేజర్ షో పెట్టి హల్ చల్ చేశారు. కానీ ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సర్వేల సంగతి ఎలా ఉన్నా.. మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు అంతంతమాత్రంగానే ఉందని నియోజకవర్గాల్లోనూ చర్చ జరుగుతుండడం గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment