బీజేపీ ఎత్తుగడలకు టీఆర్‌ఎస్‌ విరుగుడు మంత్రం! | Politics In Warangal District Is Going On In Full Swing | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎత్తుగడలకు టీఆర్‌ఎస్‌ విరుగుడు మంత్రం!

Published Sat, Sep 3 2022 5:41 PM | Last Updated on Mon, Sep 5 2022 4:19 PM

Politics In Warangal District Is Going On In Full Swing - Sakshi

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపధ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్స్ మేమేనంటూ ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. ముక్కోణపు పోటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.

పోరాటాల పురిటి గడ్డ వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ గులాబీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా మిగిలినవన్నీ గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరారు. 

తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏకపక్షంగా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి పరిషత్‌లను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో ఐదారు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నట్లు తేలింది. దీంతో గులాబీ పార్టీలో గుబులు, విపక్షాల్లో జోష్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పట్టు కోల్పోకుండా టీఆర్‌ఎస్‌.. బలపడేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు  వేస్తున్నాయి.

జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. ఎదుటి శిబిరంలో కాస్త ప్రజాదరణ ఉన్న నేతను.. తమవైపు లాగేందుకు చిత్ర విచిత్ర వ్యూహాలు రచిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ నాయకుల్లో కొందరు జిల్లా అంతటా పర్యటించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన చరిత్ర ఉండటంతో.. మరోసారి ఆ స్థాయిలో ఆ స్థాయిలో సీట్లు సాధించాలని చూస్తున్నారు కమలనాథులు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ.. వారికి కాషాయ తీర్థం ఇచ్చేందుకు తెగ శ్రమిస్తున్నారు. ఆయా నాయకుల హోదాల మేరకు రాష్ట్రస్థాయి నేతలు సైతం టచ్‌లోకి వెళ్తున్నారట. అయితే అనుకున్నంత వేగంగా చేరికలు లేకపోవడంతో బీజేపీ శిబిరాన్ని డైలమాలో పడేస్తోంది.

బీజేపీ ఎత్తుగడలు తెలుసుకున్న టీఆర్ఎస్‌ నాయకులు విరుగుడు మంత్రం వేస్తున్నారు. బీజేపీ వాళ్లనే టీఆర్ఎస్‌లోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న స్థాయి నేతలకు వల వేస్తే లాభం లేదనుకున్నారో ఏమో.. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీల్లో ఫుల్‌ టైమర్స్‌గా పనిచేసి.. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న కరుడుగట్టిన నేతలకే గురి పెట్టారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటారు.. కండువా మార్చబోరని అనుకుంటున్న వారిని లాగితే.. పార్టీ శ్రేణులు డీలా పడతాయనే ఉద్దేశంతో గట్టిగానే గాలం వేస్తున్నారట.

ఇలా వరంగల్‌ అర్బన్‌ ప్రాంతానికి చెందిన కొందరిని ఆకర్షించారు. వరంగల్‌ అర్బన్‌లో బలపడాలని చూస్తున్న బీజేపీకి తాజా వలసలు ఇబ్బందే అనే  చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ నగర అధ్యక్షునితోపాటు, ఒక కార్పొరేటర్‌కు గులాబీ కండువా కప్పేశారు. పైగా ఇది అంతం కాదు.. ఆరంభమేనని చెప్పుకొస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్‌ఎస్‌ నుంచి అసంతృప్తులు ఎవరూ కమలం శిబిరం వైపు చూడకుండా వ్యూహరచన చేశారు అధికార పార్టీ నేతలు. అయితే బీజేపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని కమలనాథులు ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే కారులో ఎక్కువమంది ఎక్కేశారని.. అందులో ఉన్నవారికి ఊపిరి సలపడం లేదని.. త్వరలోనే దిగిపోయేవాళ్లు క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని చెబుతున్నారు. వెళ్లిన దారినే తిరిగొచ్చేస్తారని ధీమాగా ఉన్నారు బీజేపీ నేతలు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement