పొత్తు తెచ్చిన చిక్కులు.. గులాబీ పార్టీలో టెన్షన్ | Khammam Politics Change With Alliance Of TRS And Communist Parties | Sakshi
Sakshi News home page

పొత్తు తెచ్చిన చిక్కులు.. గులాబీ పార్టీలో టెన్షన్

Published Sun, Nov 27 2022 9:48 AM | Last Updated on Sun, Nov 27 2022 9:53 AM

Khammam Politics Change With Alliance Of TRS And Communist Parties - Sakshi

వామపక్షాలతో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని కొంతకాలంగా ఖమ్మం జిల్లాలోని గులాబీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. అయితే పొత్తుపై అగ్ర నాయకులకు క్లారిటీ ఉందని, గులాబీ, ఎర్ర పార్టీల శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాల్సిన రోజులొస్తున్నాయని సూచనలు అందుతున్నాయి.

తెలంగాణలో ఎర్ర పార్టీలు, గులాబీ పార్టీ ఏకమవుతున్నాయా? మునుగోడు ఫలితం వారిని మరింత దగ్గర చేసిందా? అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్ పొత్తు ఖరారైందా? అవుననే అంటున్నాయి వామపక్షాల శ్రేణులు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సీట్లు కూడా పంచుకుంటున్నారు. మరి గులాబీ పార్టీలో సిటింగ్‌లు, ఆశావహుల రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోంది? వారు ఏం చేయబోతున్నారు?

పాలేరులో ఎవరు పోటీ?
ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనరల్ సీట్లు. ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలేరుకు కందాల ఉపేంద్రరెడ్డి ఎమ్మెల్యే. ఈ సీటు కోసం కందాల, మాజీ మంత్రి తుమ్మల మధ్య పోరు సాగుతోంది. ఇంతలో పాలేరు నియోజకవర్గంలో ఎర్ర జెండా ఎగురుతుందంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్‌ జిల్లాలో సంచలనం రేపింది. గులాబీ కోటలో టెన్షన్ పెరుగుతోంది. పొత్తుల్లో భాగంగా పాలేరులో తానే పోటీ చేస్తానని పార్టీ సర్కిల్స్‌లో తమ్మినేని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి సిటింగ్‌ ఎమ్మెల్యే కందాల, సీటుపై ఆశపడుతున్న తుమ్మల పరిస్తితి ఏంటనే చర్చ జిల్లాలో హాట్ హాట్‌గా సాగుతోంది.

గ్రౌండ్‌లో ఎంట్రీ ఇచ్చేశారు
వామపక్షాలతో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని కొంతకాలంగా ఖమ్మం జిల్లాలోని గులాబీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. అయితే పొత్తుపై అగ్ర నాయకులకు క్లారిటీ ఉందని, గులాబీ, ఎర్ర పార్టీల శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాల్సిన రోజులొస్తున్నాయని సూచనలు అందుతున్నాయి. ఇంతలో పాలేరు నియోజకవర్గం పరిదిలోని ముత్తగూడెంలో జరిగిన సిపిఎం నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం  పొత్తుపై చేసిన కామెంట్స్‌ జిల్లాలో సంచలనంగా మారాయి.

వచ్చే ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరబోతోందని తమ్మినేని కార్యకర్తలకు చెప్పారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లో నాలుగు నెలలుగా పర్యటిస్టున్న తమ్మినేని వీరభద్రం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల శ్రేణుల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే గులాబీ పార్టీ శ్రేణులే ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.

ముచ్చటగా ముగ్గురికి ఆశలు
పాలేరు సీటు సీపీఏంకు ఇస్తే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ పై ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాలేరు తనకే టికెట్ వస్తుందని, మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని కందాల అనేక సార్లు చెప్పారు. ఇటు తమ్మల నాగేశ్వరరావు కూడ టికెట్ పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

ఇటివలే ములుగు జిల్లా వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సైతం తాను కేసీఆర్ వెంటే ఉంటానంటూ ప్రకటించారు. దీంతో తుమ్మలకు పాలేరు టికెట్ పై కేసీఆర్ ఇంటర్నల్‌గా ఏమైన భరోసా ఇచ్చారా అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్‌లో నడిచింది. ఇద్దరు నేతలు టికెట్ కోసం తీవ్రస్థాయిలో పోటి పడుతుంటే మధ్యలో సీపీఎం వచ్చి టికెట్ తనకే అనడంతో అసలు పాలేరు టీఆర్‌ఎస్‌లో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.

టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లయితే పాలేరు సిటింగ్ ఎమ్మెల్యే కందాల, మాజీ మంత్రి తుమ్మల కచ్చితంగా జంప్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ నుంచి వచ్చేవారి కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయి. పాలేరులో ఇంకా ఎన్ని రాజకీయ సంచలనాలు జరుగుతాయో చూడాలి.
చదవండి: తెలంగాణలో మరో పాదయాత్ర?.. ఆ నాయకుడెవరు? 


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement