![Wife And Husband Ends Life In Kamareddy District - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/22/KID.jpg.webp?itok=VryxgcY4)
రామారెడ్డి: రాత్రి జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఉరికి వేలాడుతున్న తల్లిదండ్రులు ఇంకా నిద్రలేవలేదనుకొని ఆరేళ్ల బాలుడు ‘అమ్మా లేమ్మా.. తెల్లారింది. నాన్న నువ్వైనా నిద్ర లెవ్వు’అని తట్టిలేపడం చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నామాల శంకర్ (40), సుజాత (35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
వీరికి ఆరేళ్ల బాలుడు ప్రేమ్‌కుమార్ ఉన్నాడు. ఆదివారం రాత్రి నిద్రపోయేటప్పుడు ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కొడుకు నిద్రపోయాక ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బాలుడు ఉదయం లేచి మెడకు తాడుతో వేలాడుతున్న తల్లిదండ్రులను చూసి లేపగా వాళ్లు కదళ్లేదు. దీంతో తలుపులు తీసుకొని బయటకు వచ్చి నానమ్మ దగ్గరికెళ్లి అమ్మానాన్న నిద్రలేవట్లేదని చెప్పి తీసుకొచ్చాడు. వారి శవాలను చూసి ఆమె.. పక్కనున్నవారికి సమాచారం అందించింది. బాలుడు ‘లే అమ్మా’అని తల్లిపై పడుకొని ఏడ్వడం అక్కడున్న వారిని కలచి వేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment