wife husband die
-
నలుగురిని బలిగొన్న క్షణికావేశం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది
రామాయంపేట (మెదక్) : క్షణికావేశం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. తెలిసిన వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన కొడుకు ఎల్లంకు, మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన లక్ష్మి (నాగలక్ష్మి)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల లోపు ఆడపిల్లలు శరణ్య, శ్రావ్య ఉన్నారు. ఎల్లంకు తల్లిదండ్రులతోపాటు ఇద్దరు సోదరులున్నారు. అందులో ఎల్లమే పెద్దవాడు. ఎల్లంతోపాటు రెండోవాడు అశోక్‌కు పెళ్లి కాగా, మూడో కుమారుడు రాజుకు పెళ్లి కాలేదు. వారికి వ్యవసాయ భూమి లేకపోవడంతో ఎల్లం, తన చిన్న తమ్ముడు రాజుతో కలిసి హైదరాబాద్‌లో పని చేసుకుంటున్నాడు. కాగా వారిది ఉమ్మడి కుటుంబం. ఒకేచోట కలిసి ఉంటున్నారు. ఎల్లం.. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఈనెల 12న భార్యాభర్తల మధ్య గొడవ జరుగగా, క్షణికావేశంతో ఎల్లం పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇద్దరు కూతుర్లను తీసుకొని ఆస్పత్రికి వెళ్లిన లక్ష్మికి తన భర్త బతికే అవకాశం లేదని తెలుసుకుంది. దీంతో విలపిస్తూ ఇద్దరు పిల్లలను వెంట తీసుకొని ఆస్పత్రి నుంచి పుట్టింటికి బయలుదేరగా మార్గమధ్యలో కొంటూర్ వద్ద ఆగింది. అక్కడ సమీపాన ఉన్న చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తానూ నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆమె భర్త బుధవారం మృతిచెందాడు. -
ఎంతటి విషాదం: ‘నానమ్మ.. అమ్మా, నాన్నలు ఎక్కడున్నారు’
ప్రత్తిపాడు (గుంటూరు): అమెరికాలోని న్యూజెర్సీలో తుపాను దృశ్యాలను ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో భారీ ఐస్ గడ్డల నుంచి జారిపడి సరస్సులోకి జారి మృత్యువాత పడిన ముద్దన నారాయణ, హరిత దంపతుల మృతదేహాల రాక కోసం వారి కుటుంబీకులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం రీత్యా అమెరికా వెళ్లి అరిజోనాలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు గత నెల 26వ తేదీన విహార యాత్రకు వెళ్లి సరస్సులో గల్లంతై మృత్యువాత పడిన విషయం విదితమే. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో ఉండిపోయిన వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షితలను టీసీఎస్ కంపెనీ సహకారంతో భారత్‌కు తీసుకువచ్చారు. శనివారం ఉదయం అమెరికాలోని డల్లాస్ నుంచి బయల్దేరిన ఆ పిల్లలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోగా.. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక వాహనంలో స్వగ్రామమైన పాలపర్రుకు తీసుకువచ్చి తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ వెంకటరత్నంకు అప్పగించారు. ‘అమ్మా నాన్నలేరీ!’ ‘నానమ్మ.. అమ్మా, నాన్నలు ఏరీ’ అంటూ నారాయణ, హరిత దంపతుల చిన్నకుమార్తె హర్షిత అడుగుతున్న తీరు బంధువుల్ని, గ్రామస్తుల్ని కన్నీరు పెట్టిస్తోంది. అమ్మానాన్న మరణించారన్న విషయం తెలియని ఆ చిన్నారిని చూసి వారంతా చలించిపోతున్నారు. బాధను పంటి బిగువున భరిస్తూ చిన్నారులను ఓదార్చుతున్నారు. తల్లిదండ్రులు ఇక రారన్న చేదు నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక తాతయ్యలు, నాయనమ్మ, అమ్మమ్మలు భోరున విలపిస్తున్నారు. ఇప్పటికే ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం, నేటికీ వారి చివరి చూపునకు కూడా నోచుకోని పరిస్థితులు ఉత్పన్నం కావడంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. -
నెల్లూరులో దారుణం.. జంట హత్యల కలకలం
సాక్షి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు: జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తలిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. వివరాల ప్రకారం.. నెల్లూరులోని మినీ బైపాస్‌రోడ్డులోని ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద కృష్ణారావు, అతడి భార్య పద్మ నివాసం ఉంటున్నారు. కాగా, శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు వారింట్లోకి దూరి.. దంపతులిద్దర్నీ దారుణంగా హత్య చేశారు. అనంతరం.. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని దోచుకొని ఇంటి వెనుక ద్వారం గుండా పారిపోయారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
భూతగాదాలకు దంపతులు బలి
పాలకుర్తి(రామగుండం): భూతగాదాలు దంపతుల హత్యకు దారితీశాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మంచినీళ్ల వెంకటి (55), తమ్ముడు రాజయ్య మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య కుమారుడు రవితేజ గురువారం పొలం వద్దకు వెళ్లి బావి నీటి విషయమై వెంకటితో ఘర్షణ పడ్డాడు. గొడ్డలితో దాడి చేయడంతో ప్రాణాలొదిలిన వెంకటిని లాక్కెళ్లి సమీపంలోని పొదల్లో పడేశాడు. పొలంలో కలుపుతీస్తున్న వెంకటి భార్య కనకమ్మ గమనించి పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆమెపైనా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కనకమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం నిందితుడు బసంత్‌నగర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. మృతిచెందిన వెంకటి దంపతులకు కూతురు రాధ, కుమారుడు రమేష్ ఉన్నారు. రాధకు వివాహం కాగా, రమేష్ కరీంనగర్‌లోచదువుకుంటున్నాడు. వెంకటి గతంలో గ్రామ ఎంపీటీసీగా పనిచేశారు. పంపకాల్లో తేడాలతోనే... వెంకటి, రాజయ్యల వారసత్వ భూమిలో ఇదివరకు సబ్సిడీ బావిని తవ్వారు. భూపంపకాల అనంతరం ఆ బావిలో రాజయ్యకు వాటా లేదని వెంకటి అనడంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఇరువురి మధ్య వ్యవసాయబావి, భూముల విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వివాదం పోలీసుస్టేషన్ వరకు వెళ్లినా అది సివిల్ సమస్య కావడంలో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే రవితేజ పథకం ప్రకారం పెద్ద నాన్న, పెద్దమ్మను గొడ్డలితో నరికి చంపాడని గ్రామస్థులు భావిస్తున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో గ్రామానికి చెందిన కొండ గట్టయ్య దంపతులను వారి కుమారులు కల్లుగీత కత్తితో గొంతులు కోసి హత్య చేశారు. ప్రస్తుతం అదేరీతిన భూవివాదాల నేపథ్యంలో సొంత పెద్దమ్మ, పెద్దనాన్నను కుమారుడి వరసైన యువకుడు గొడ్డలితో హత్య చేసి చంపాడు. -
అమ్మా.. తెల్లారింది లేమ్మా!
రామారెడ్డి: రాత్రి జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఉరికి వేలాడుతున్న తల్లిదండ్రులు ఇంకా నిద్రలేవలేదనుకొని ఆరేళ్ల బాలుడు ‘అమ్మా లేమ్మా.. తెల్లారింది. నాన్న నువ్వైనా నిద్ర లెవ్వు’అని తట్టిలేపడం చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నామాల శంకర్ (40), సుజాత (35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల బాలుడు ప్రేమ్‌కుమార్ ఉన్నాడు. ఆదివారం రాత్రి నిద్రపోయేటప్పుడు ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కొడుకు నిద్రపోయాక ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బాలుడు ఉదయం లేచి మెడకు తాడుతో వేలాడుతున్న తల్లిదండ్రులను చూసి లేపగా వాళ్లు కదళ్లేదు. దీంతో తలుపులు తీసుకొని బయటకు వచ్చి నానమ్మ దగ్గరికెళ్లి అమ్మానాన్న నిద్రలేవట్లేదని చెప్పి తీసుకొచ్చాడు. వారి శవాలను చూసి ఆమె.. పక్కనున్నవారికి సమాచారం అందించింది. బాలుడు ‘లే అమ్మా’అని తల్లిపై పడుకొని ఏడ్వడం అక్కడున్న వారిని కలచి వేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. -
భార్య నిర్లక్ష్యం చేస్తోందని..
మద్దూరు: భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో నిద్రలో ఉండగానే గొడ్డలితో నరికి చంపాడో భర్త. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనందదాసు ఉప్పలయ్య (65), సత్తమ్మ (60) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ముగ్గురినీ సత్తమ్మ తన పుట్టింట్లో ఉంచింది. తరచూ వారిని చూసే నిమిత్తం జనగామ జిల్లా నర్మెట్టలోని తల్లిగారింటికి వెళ్తుండేది. తన బాగోగులు చూడకుండా, మద్యానికి డబ్బులు ఇవ్వకుండా సత్తమ్మ తనను నిర్లక్ష్యం చేస్తోందని కక్షగట్టిన ఉప్పలయ్య పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా పెట్టించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యాభర్తలు ఇదే విషయమై గొడవపడ్డారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటాక ఉప్పలయ్య.. నిద్రలో ఉన్న సత్తమ్మను గొడ్డలితో నరికి చంపాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న పెద్ద కుమారుడికి ఫోన్ చేసి హత్య విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నానని చెప్పాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అనుమానం వచ్చిన కుమారుడు భాస్కర్ వెంటనే బండనాగం గ్రామంలో ఉండే తన బావమరిదికి ఫోన్ చేసి వెంటనే తన ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు. అతను రాత్రి ఒంటిగంటకు ధర్మారం వచ్చి ఇంటి తలుపు తీసి చూడగా, దంపతులు ఇద్దరూ వేర్వేరు గదుల్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. మొదట భార్యను గొడ్డలితో నరికి, అనంతరం తాను బ్లేడుతో గొంతు కోసుకుని ఉప్పలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కుమారుడు ఆనందదాసు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చేర్యాల సీఐ చంద్రశేఖర్‌గౌడ్, మద్దూరు ఎస్ఐ ఎన్.విజేందర్ తెలిపారు. -
మృత్యువులోనూ వీడని బంధం
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం హైదరాబాద్(బాలానగర్): రోడ్డు ప్రమాదం ఇద్దరి భార్యాభర్తలను బలిగొన్న సంఘటన శుక్రవారం ఉదయం బాలానగర్ మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద గల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కేరళ రాష్ట్రం పాలఖడ్ తాలుకా, కాలపత్తి గ్రామానికి చెందిన రిటైర్డు సీఐఎస్ఎఫ్, రిటైర్డు మిలిటరి అధికారి అయిన విశ్వనాథం (60) అతని భార్య శ్యామల (54) మనుమరాలు ప్రియలు కలిసి బెంగుళూర్ నుంచి తన షిప్టుకారులో హైదరాబాద్‌లో నివసిస్తున్న తమ కూతుళ్లు దివ్య, ధన్యల వద్దకు బయలుదేరారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున బాలానగర్ మండల శివారులోని పెద్దాయపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిని వద్ద ఎలాంటి సిగ్నల్స్ పాటించకుండా ఓ లారి కుడివైపు ఉడిత్యాలవైపు యుటర్న్ మల్లుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు లారీని బలంగా ఢీకొంది. దీంతో కారులో ముందు భాగంలో ఉన్న భార్యభర్తలు ఇద్దరు కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందారు. వెనుక సీట్లో కూర్చున్న మనుమరాలు ప్రియ (5)కు తీవ్రగాయాలపాలైంది. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున భార్యభర్తల మృతదే హాలను బయటకు తీసి తీవ్రంగా గాయపడిన ప్రియను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన విశ్వనాథం అనంతపురం జిల్లా కోడికొండవద్ద గల జీఎంఆర్ రక్షక్ ట్రేనింగ్ సెంటర్లో రక్షక్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వారి కూతుళ్లకు సమాచారం అందించి మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.