ఇద్దరు పిల్లలతో ఎల్లం, లక్ష్మి (ఫైల్)
రామాయంపేట (మెదక్) : క్షణికావేశం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. తెలిసిన వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన కొడుకు ఎల్లంకు, మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన లక్ష్మి (నాగలక్ష్మి)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల లోపు ఆడపిల్లలు శరణ్య, శ్రావ్య ఉన్నారు. ఎల్లంకు తల్లిదండ్రులతోపాటు ఇద్దరు సోదరులున్నారు. అందులో ఎల్లమే పెద్దవాడు.
ఎల్లంతోపాటు రెండోవాడు అశోక్‌కు పెళ్లి కాగా, మూడో కుమారుడు రాజుకు పెళ్లి కాలేదు. వారికి వ్యవసాయ భూమి లేకపోవడంతో ఎల్లం, తన చిన్న తమ్ముడు రాజుతో కలిసి హైదరాబాద్‌లో పని చేసుకుంటున్నాడు. కాగా వారిది ఉమ్మడి కుటుంబం. ఒకేచోట కలిసి ఉంటున్నారు. ఎల్లం.. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఈనెల 12న భార్యాభర్తల మధ్య గొడవ జరుగగా, క్షణికావేశంతో ఎల్లం పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి తరలించారు.
కాగా ఇద్దరు కూతుర్లను తీసుకొని ఆస్పత్రికి వెళ్లిన లక్ష్మికి తన భర్త బతికే అవకాశం లేదని తెలుసుకుంది. దీంతో విలపిస్తూ ఇద్దరు పిల్లలను వెంట తీసుకొని ఆస్పత్రి నుంచి పుట్టింటికి బయలుదేరగా మార్గమధ్యలో కొంటూర్ వద్ద ఆగింది. అక్కడ సమీపాన ఉన్న చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తానూ నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆమె భర్త బుధవారం మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment