సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామశివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి సరిగ్గా వందేళ్లవుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణమది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1917లో శ్రీకారం చుట్టి, 1922లో పూర్తిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.27.11 లక్షలు.
నిజాం ప్రభుత్వ ఇంజనీర్ ఆలీ నవాబ్‌జంగ్ బహద్దూర్ ఆధ్వర్యంలో 21 అడుగుల ఎత్తుతో, 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రాళ్లు, డంగు సున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ నిర్మించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు.
కాగా, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. రెండు మండలాల్లోని 43 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా అందుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ఏటా ఖరీఫ్ సీజన్‌లో రెండు జోన్లకు, రబీలో ఒక ఏడాది ‘ఏ’జోన్‌కు, మరో ఏడాది ‘బీ’జోన్‌కు వంతులవారీగా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు.
ప్రాజెక్టు ఎత్తును ఐదడుగులు పెంచితే నీటినిల్వ సామర్థ్యం పెరిగి ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ డిమాండ్‌ను పట్టించుకునే నాథుడేలేరు.
పోచారం అభయారణ్యంలో జింకల సందడి
విదేశీ పక్షుల సందడి
పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నదంటే విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా నైజీరియాకు చెందిన పక్షులు పెద్దసంఖ్యలో వచ్చి సందడి చేస్తాయి. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన పర్యాటకులను పక్షులు ఆకట్టుకుంటాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను బందిస్తుంటారు. అలుగులు పారే నీరు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ఎంతో శోభను సంతరించుకుంటుంది.
పర్యాటకాభివృద్ధి అంతంతే..
పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పట్లో బోటింగ్ కోసం ప్రయత్నాలు జరిగినా, ముందుకు సాగలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్మించిన గెస్ట్‌హౌస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ముందు మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేలా టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందానికి ఆస్కారముందని జిల్లావాసులు పేర్కొంటున్నారు.
వన్యప్రాణుల కోసం అభయారణ్యం...
ప్రాజెక్టుకు సమీపంలో పోచారం అభయారణ్యాన్ని 1952 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కామారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ అధీనంలో ఉండగా, అభయారణ్యం నిర్వహణను మెదక్ జిల్లా అటవీ శాఖ చూసుకుంటోంది. అభయారణ్యంలో జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. సందర్శకులు వన్యప్రాణులను చూడటానికి అభయారణ్యంలో వాహనాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment