pocharam project
-
అలుగులు పారే.. అందాల జోరే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామశివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి సరిగ్గా వందేళ్లవుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణమది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1917లో శ్రీకారం చుట్టి, 1922లో పూర్తిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.27.11 లక్షలు. నిజాం ప్రభుత్వ ఇంజనీర్ ఆలీ నవాబ్‌జంగ్ బహద్దూర్ ఆధ్వర్యంలో 21 అడుగుల ఎత్తుతో, 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రాళ్లు, డంగు సున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ నిర్మించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. కాగా, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. రెండు మండలాల్లోని 43 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా అందుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీలో ఒక ఏడాది ‘ఏ’జోన్‌కు, మరో ఏడాది ‘బీ’జోన్‌కు వంతులవారీగా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును ఐదడుగులు పెంచితే నీటినిల్వ సామర్థ్యం పెరిగి ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ డిమాండ్‌ను పట్టించుకునే నాథుడేలేరు. పోచారం అభయారణ్యంలో జింకల సందడి విదేశీ పక్షుల సందడి పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నదంటే విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా నైజీరియాకు చెందిన పక్షులు పెద్దసంఖ్యలో వచ్చి సందడి చేస్తాయి. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన పర్యాటకులను పక్షులు ఆకట్టుకుంటాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను బందిస్తుంటారు. అలుగులు పారే నీరు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ఎంతో శోభను సంతరించుకుంటుంది. పర్యాటకాభివృద్ధి అంతంతే.. పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పట్లో బోటింగ్ కోసం ప్రయత్నాలు జరిగినా, ముందుకు సాగలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్మించిన గెస్ట్‌హౌస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ముందు మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేలా టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందానికి ఆస్కారముందని జిల్లావాసులు పేర్కొంటున్నారు. వన్యప్రాణుల కోసం అభయారణ్యం... ప్రాజెక్టుకు సమీపంలో పోచారం అభయారణ్యాన్ని 1952 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కామారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ అధీనంలో ఉండగా, అభయారణ్యం నిర్వహణను మెదక్ జిల్లా అటవీ శాఖ చూసుకుంటోంది. అభయారణ్యంలో జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. సందర్శకులు వన్యప్రాణులను చూడటానికి అభయారణ్యంలో వాహనాన్ని ఏర్పాటు చేశారు. -
‘పోచారం’ వద్ద పర్యాటకుల సందడి
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. చాలారోజుల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి పర్యాటకులు నడుచుకుంటూ ఉత్సాహాంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద వంటలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 18ఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఎగువప్రాంతం నుంచి ప్రస్తుతం 285క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1461.33అడుగులతో 1.398టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ధర్నా
ఎల్లారెడ్డి: పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోచారం ప్రాజెక్టు ఎత్తును ఐదు అడుగులకు పెంచాలని అన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు త్రాగు నీరు, సాగు నీరు లభిస్తుందని అన్నారు. పోచారం ప్రాఎక్టు ఎత్తుపెంచే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అఖిల పక్షం నాయకులు అన్నారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు గయాజుద్దిన్, చిరంజీవులు, బాలకిషన్, ఇమ్రాన్, బాలరాజు, సాయిరాములు, ఏగుల నర్సింలు తదితరులు ఉన్నారు. -
‘పోచారం’ ఎత్తు పెంచితే ముప్పు తప్పదు
హవేలి ఘణాపూర్ (మెదక్): పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచితే పొలాలకు ముప్పు తప్పదని మెదక్, కామారెడ్డి జిల్లాల రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం అభయార ణ్యంలో బుధవారం వీరంతా సమావేశమ య్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎత్తును పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రాజెక్టు ఎత్తుతో మెదక్ జిల్లా హవేలి ఘణాపూర్ మండల పరిధిలోని రాజ్‌పేట, పోచమ్మ రాల్, కొత్తపల్లి, బూర్గుపల్లి, కామారెడ్డి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని వదల్పర్తి, శెట్టిపల్లి సంగారెడ్డి, పొల్కం పేట పరిధిలోని వేల ఎకరాల పంట పొలా లు నీట మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోచారం ప్రాజెక్టు నిండినప్పుడు పలు గ్రామాల్లోని పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయశాఖ మంత్రి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచబోమని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. రైతు విధానాలకు వ్యతిరేకంగా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తే రైతులందరం పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
పోచారం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్లోని పోచారం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. గోలిలింగాల్, చినూర్వాడి గ్రామశివారులో నీట మునిగిన పంటల్ని పరిశీలించారు. వరదలు, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. -
పోచారానికి పర్యాటక కళ
పొంగిపొర్లుతున్న ప్రాజెక్టు డ్యాం పరిసర ప్రాంతాల్లో వెలసిన దుకాణాలు మెదక్ రూరల్: గడిచిన రెండు సంవత్సరాల్లో తీవ్ర అనావృష్టితో చెరువులు, కుంటలతో పాటు -ప్రాజెక్టులు సైతం పూర్తిగా వట్టిపోయాయి. మెదక్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులోని పోచారం -ప్రాజెక్టు పర్యాటకులకు ప్రతియేటా కనువిందు చేస్తోంది. ప్రాజెక్టును ఆనుకుని పోచారం అభయారణ్యం ఉంది. ఇందులో జింకలతో పాటు అనేక రకాల జంతువులున్నాయి. అలాగే ప్రపంచప్రసిద్ధిగాంచిన చర్చి, ఏడుపాయల దుర్గాభవాని, కాకతీయుల కాలంనాటి ఖిల్లా ఈ ప్రాంతంలో ఉండటంతో వీటిని తిలకించేందుకు పర్యాటకులు రాష్ట్రనలుమూలల నుంచి భారీ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా పోచారం అభయారణ్యం హైదరాబాద్ నగరానికి కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకులు కుటుంబాలతో వస్తుంటారు. కాగా రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక పోవటంతో ప్రాజెక్టు పూర్తిగా వట్టిపోయింది. దీంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి మళ్లీ మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజమాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. సందర్శకులను దృష్టిలో పెట్టుకుని చిరువ్యాపారుల దుకాణాలు డ్యాం ప్రాంతంలో వెలిశాయి. -
వర్ష బీభత్సానికి పాత ఇళ్లు నేలమట్టం
నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు కూలిపోతున్నాయి. భాన్సువాడ మండల పరిధిలో వర్ష బీభత్సానికి 20 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వేలాది ఎకరాల్లో సోయపంట నీట మునిగింది. కోటగిరి మండలంలో 43 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్ని మండలంలో 74 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. గంధారి మండలంలోని సర్వాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద వాగు పొంగిపొర్లుతుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాందేడ్- సంగారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సదాశివనగర్ కొత్త చెరువు పూర్తిగా నిండి అలుగుపోస్తోంది -
చేపపిల్లల్ని వదిలిన మంత్రి
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఆదివారం నాడు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపపిల్లల్ని వదిలారు. ఈ ప్రాజెక్టులో 2.2 లక్షల చేపపిల్లల్ని వదలడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించినట్లు అవుతుందన్నారు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్య కారులను, రైతులను ఆదుకుంటామని మంత్రి పోచారం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను త్వరితగతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితర నాయకులు పాల్గొన్నారు. -
‘స్వగృహ’ బంపర్ ఆఫర్
ప్రాజెక్టు ధరలు భారీగా తగ్గింపు బండ్లగూడలో చదరపు అడుగుకు రూ.2,200 పోచారంలో రూ.2,050 చొప్పున నిర్ధారణ! ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో అమ్ముడు పోకుండా తెల్ల ఏనుగుల్లా మిగిలిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను వదిలించుకునేక్రమంలో ప్రభుత్వం వాటి ధరలను భారీగా తగ్గించింది. కొనేవారు లేకున్నా ధరలను మాత్రం తగ్గించబోమంటూ ఇప్పటి వరకు భీష్మించుకు కూర్చున్న అధికారులు వాస్తవాలను గుర్తించి దిగొచ్చారు. ఇప్పటి వరకు చదరపు అడుగు ధర దాదాపు రూ.2,800కు పైగా ఉన్న బండ్లగూడ స్వగృహ ప్రాజెక్టు ధరను రూ.2,200కు, చదరపు అడుగు ధర రూ.2,600 వరకు ఉన్న పోచారం ప్రాజెక్టు ధరను రూ.2,050కు తగ్గించేలా కసరత్తు చేస్తున్నారు. ఏకమొత్తంలో ఇళ్లను కొనేందుకు ముందుకొస్తే ధరలను మరింత తగ్గించేలా ‘బేరసారాల’కు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు వెలువడనున్నాయి. దీంతో సింగిల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.2 లక్షలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.3 లక్ష ల మేర తగ్గనున్నాయి. పోచారం, బండ్లగూడ ప్రాజెక్టులకు ఈ కొత్త ధరలను వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం బండ్లగూడలో రెండు వేలు, పోచారంలో రెండున్నరవేల ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. స్వగృహను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడంతో అప్పట్లో ప్రభుత్వం వాటి నిర్మాణంలో మన్నికకు పెద్దపీట వేసింది. కానీ, ధరలు భారీగా ఉండడంతో ఇళ్ల కొనుగోలుకు ప్రజలు పెద్దగా ముందుకురాలేదు. ఇప్పుడు ధరలను భారీగా తగ్గించడంతో అమ్మకాలు జోరుగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడ ప్రాజెక్టును రాయితీ ధరలకు ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని మొదట నిర్ణయించినా ఇప్పుడు సాధారణ ప్రజలు ముందుకొస్తే వారికి కూడా అమ్మాలని భావిస్తున్నారు. భారీగా ‘అదనపు’ ధరలు .. ధరలు తగ్గించడం వరకు బాగానే ఉన్నా అధికారులు ఇక్కడ చేసిన ప్రయోగం కొనుగోలుదారులను కలవరపెట్టేలా ఉంది. ప్రైవేటు బిల్డర్ల తరహాలో కొత్త ధరలను నిర్ధారించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఫ్లాట్ ధరకు ఇతర వసతుల రుసుం అదనం అని ప్రకటించాలని నిర్ణయించారు. స్వగృహ ప్రాజెక్టుల్లో పైప్డ్ గ్యాస్, కామన్ సోలార్‌వాటర్ హీటర్, కబ్బోర్డ్స్తో పాటు పూర్తిస్థాయిలో ఫర్నిషింగ్... ఇలా కొన్ని హంగుల ధరను ఇంటి ధరలో కలపకుండా విడిగా చూపారు. చదరపు అడుగు ధరగా అధికారులు ప్రకటించే మొత్తంలో ఇవి కలవవు. సింగిల్ బెడ్ రూంకు రూ. లక్షన్నర, డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌కు రూ. రెండున్నర లక్షలు... ఇలా విస్తీర్ణం పెరిగే కొద్దీ ఈ ‘అదనపు’ ధరలు పెరుగుతాయి. అలాగే వాహన పార్కింగ్‌కు విడిగా ధర ఖరారు చేస్తున్నారు. కవర్డ్ పార్కింగ్ స్థలం (యజమానికి శాశ్వత నిర్ధారిత స్థలం) కోసం పోచారంలో రూ.1.25 లక్షలు, బండ్లగూడలో రూ.1.75 లక్షలుగా నిర్ధారించాలని నిర్ణయించారు. కేవలం చదరపు అడుగు ధర ప్రకారం లెక్కిస్తే ఇంటి ధర తక్కువగా కనిపించినా... ఇవన్నీ కలిపితే మళ్లీ ఎక్కువగానే ఉండనుంది. అయితే కొన్ని ఫ్లాట్లలో ఆ హంగులు లేవు. వాటికి అదనపు ధరలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. కార్పస్ ఫండ్ ఏర్పాటు.. మెగా ప్రాజెక్టులు కావటంతో వాటి నిర్వహణ భారంగా ఉంటుంది. భవిష్యత్తులో వాటికి రంగులేయాలన్నా, మరమ్మతులు చేయాల్సి వచ్చినా నిర్వహణ సులభంగా ఉండేందుకుగాను కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొనుగోలుదారులు చదరపు అడుగుకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. దానిపై వచ్చే వడ్డీతో అవసరమైన పనులు చేయిస్తారు. -
పోచారం ‘జోన్ల’ విభజన బాగుంది
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు ఆయకట్టును ‘ఏ’,‘బీ’జోన్లుగా విభజించిన విధానం బాగుందని మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ అధికారుల బృందం కితాబుని చ్చింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన నీటి పారుద ల శాఖ చీఫ్ ఇంజినీర్ అవినాష్ షర్వేతోపాటు ఏడుగురు ఎస్ఈలు, నలుగురు ఈఈలు స్టడీ టూర్లో భాగంగా మండలంలోని పోచారం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. హైదరాబాద్‌లోని వాల ంతరీకి చెందిన ఐడీ అండ్ సీబీ ఎక్స్పర్ట్ ఝాన్సీరాణి, ట్రైనింగ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ వారికి పోచారం ప్రాజెక్టు చరిత్ర, ఆయకుట్ట వివరాలు, ప్రాజెక్టు నీటి వినియోగం తీరును గురించి వివరించారు. అనంతరం అవినాష్ షర్వే స్థానిక విలేకరులతో మాట్లాడా రు. తెలంగాణలోని మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అధ్యయ నం చేయడానికి రెండురోజుల క్రితం తాము హైదరాబాద్‌కు వచ్చామన్నారు. మొదటిరోజు ఇరిగేషన్ అధికారులకు శిక్షణను ఇచ్చే వాలంతరీని, పటాన్‌చెర్వులోని ఇక్రిశాట్ను సందర్శించామన్నారు. రెండోరోజు పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చామన్నారు. ప్రాజెక్టుల్లోని సాగునీటిని ప్రజల భాగస్వామ్యంతో వినియోగించుకునే తీరును అధ్యయనం చేస్తున్నామన్నారు. పోచారం ప్రాజెక్టు నీటిని ఖరీఫ్‌లో పూర్తి ఆయకట్టుకు అందించి, రబీలో మాత్రం ‘ఏ’,‘బీ’జోన్లకు అందించడం బాగుందన్నారు. ఈ విధా నం వల్ల ప్రాజెక్టులోని నీరు కొద్దిపాటి ఆయకట్టుకైనా పూర్తిస్థాయిలో అందుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులు సుమారు 3,700 ఉన్నాయని అవినాష్ షర్వే తెలిపారు. తెలంగాణలో వరి సాగుచేసే రైతుల నుం చి ఎకరాకు రూ. 200 చొప్పున నీటితీరువా వసూలు చేస్తుండగా తమ రాష్ట్రంలో ఎకరాకు రూ. 476 నీటిపన్ను వసూలు చేస్తున్నామన్నారు. చెరుకు రైతుల నుంచి ఇక్కడ ఎకరానికి రూ. 350 వసూలు చేస్తుండ గా మహారాష్ర్టలో రూ. 4,500 వసూలు చేస్తున్నామన్నారు. తమ రాష్ట్రంలో రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు నుంచే ప్రాజెక్టుల నిర్వహణకు కొంతభాగం కేటాయిస్తామని తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో మహారాష్ట్రకు చెందిన ఎస్ఈలు పటాక్, గునలే, సంజీవ్ టటు, షాహ్, అజయ్ కోహీర్కర్, సంతోష్ తిరమన్వర్, ఈఈలు అశిశ్ దేవ్ఘడే, బోడ్కే, రాథోడ్, విశ్వకర్మ, బోర్సేతోపాటు కామారెడ్డి ఈఈ మధుకర్‌రెడ్డి, డీఈఈ విజయేందర్‌రెడ్డి ఉన్నారు. నిజాంసాగర్‌లో.. నిజాంసాగర్ : మహారాష్ట్ర ప్రాంత నీటిపారుదలశాఖ ఇంజినీర్లు మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి పంపిణీ తీరును తెలుసుకున్నారు. ప్రాజెక్టు గురించి స్థానిక అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. ఐబీసీబీ నిపుణురాలు ఝాన్సీరాణి, టీం కన్వీనర్ చంద్రశేఖర్ స్థానిక డిప్యూటీ ఈఈ సురేశ్‌బాబు తదితరులున్నారు. ఎక్లాస్‌పూర్‌లో.. కోటగిరి : ఎక్లాస్పూర్ నీటి సంఘం కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం సందర్శించింది. బృంద సభ్యులు నీటి సంఘం ద్వారా చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామని సంఘం అధ్యక్షుడు శరత్‌బాబు వారికి వివరించారు. -
పోచారం ఎత్తు పెంచితే ముప్పే
మెదక్ రూరల్: మెదక్, నిజమాబాద్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంచితే ఊళ్లకు ఊళ్లే ముంపునకు గురవుతాయని రెండు జిల్లాల రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. పోచారం ఎత్తు పెంచే విషయమై సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినదించారు. రెండు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు పోచారం ప్రాజెక్టు వద్ద జలదీక్ష చేపట్టి తమ ఆందోళన కొనసాగించడంతో ఈ ప్రాంతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. ఇటీవల నిజామాబాద్ ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రెండు జిల్లాలకు చెందిన రైతులు పోచారం ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు ఎత్తు పెంచితే మెదక్ మండలంలోని వాడి, భూర్గుపల్లి, కొత్తపల్లి, రాజిపేటతో పాటు నిజమాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన వదూర్పల్లి, పోచారం, శెట్టిపల్లి, నాగిరెడ్డిపేట గ్రామాలతో పాటు వేలాది ఎకరాల్లో భూములు ముంపుకు గురవుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మద్దుతుగా మెదక్, నిజమాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మెదక్ డీసీసీ ఉపాధ్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. పునర్నిర్మాణమంటే తెలంగాణ పల్లెలను ముంచడమేనా అని ప్రశ్నించారు. పోచారం ప్రాజెక్టు నిర్మాణంతో మెదక్ మండలంలోని మిరుగుడుపల్లే అనే గ్రామం పూర్తిగా కనుమరుగైందని, అలాగే నిజామాబాద్ జిల్లాలోని పలుగ్రామాలు మునిగిపోతే ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయి మరోచోట గ్రామాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. సమస్య గురించి ఈ ప్రాంత నేతలకు తెలిసినా వారు కేసీఆర్‌కు వివరించపోవడం దారుణంగా ఉందన్నారు. కేవలం పదవుల కోసమే వారంతా కేసీఆర్ తానా అంటే తందానా అంటూ పాటపాడుతున్నారని ధ్వజమెత్తారు. పోచారం ప్రాజెక్టును ఎత్తుపెంచాలని నిజామాబాద్ జిల్లా రైతులు కానీ, మెదక్ జిల్లా రైతులు కానీ సీఎంను అడిగారా ...? అని ఆయన ప్రశ్నించారు. కేవలం సిద్దిపేట, గజ్వేల్‌కు తాగు, సాగునీరు అందించేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పెంచాలని కుట్ర పన్నారన్నారు. అదే జరిగితే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వమన్నారు. అంతేకాకుండా ఎక్కపడితే అక్కడ నిర్బంధిస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజాధనం అంతా గజ్వేల్, సిద్దిపేటలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంచే విషయాన్ని విరమించుకోకపోతే ప్రాణాలైనా అర్పించి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేలాది మంది రైతులతో పాటు మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు తార్య, ఆంజనేయులు, రాంచందర్‌రావు, శ్రీకాంత్, నాగేశ్వరరావు, అఫీజోద్దీన్, యామిరెడ్డి, నాగరాజు, సూర్యం, సాయిలు, రాములుతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు గోపాల్‌గౌడ్, మధుక ర్, వెంకటేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
‘అలసత్వాని’కి అందలం!
సాక్షి, నిజామాబాద్: సదరు అధికారి విధులలో కొనసాగేలా నేడో, రేపో ప్రత్యేక జీఓను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేయడం ఆ శాఖ వర్గాలలో చర్చనీయాం శంగా మారింది. ‘అధికార’ నేతల అడుగులకు మడుగులొత్తడం ఆయనకున్న ప్రత్యేక అర్హత అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ సంగతి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు కాలువ మరమ్మతు పను లు మూడేళ్ల క్రితం జరిగాయి. కాలువలకు సిమెంట్‌తో లైనింగ్ పనులు చేపట్టారు. నీటి పారుదలశాఖ అధికారుల అలసత్వం కారణంగా రూ.లక్షలు విలువ చేసే సిమెంట్, కాంక్రీట్ పనులు అస్తవ్యస్తంగా కొనసాగా యి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం తో ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం భారీగా అక్రమాలు జరి గినట్లు తేల్చింది. ఇందులో సదరు అధికారి అలసత్వం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖకు నివేదిక కూడా పంపారు. ఈ నివేదిక ఆధారంగా సదరు అధికారి పదోన్నతి కూడా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా భారీ నీటిపారుదల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరుతో సుమారు 20 మందికి పైగా అధికారులు పదవీ విరమణ చేస్తున్నా రు. వీరందరిని పక్కన బెట్టి విజిలెన్స్ విచారణ ఎదుర్కొని, పదోన్నతి నిలిచిపోయిన ఈ ఒక్క అధికారి పదవీకాలాన్ని మాత్రమే పొడిగించాలని నీటి పారుద ల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీప్ (ఈఎన్సీ) కార్యాలయం లో కొందరు పావులు కదుపుతున్నారని సమాచారం. ఇది ఆ శాఖ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పదవీ విరమణ చేస్తున్న అధికారి పదవీకాలాన్ని పొడగించాలన్నా, జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లాలి. నిబంధనల ప్రకారం ఆశాఖ (ఎస్ఈ ప్రతిపాదించాలి. ఇవేవీ లేకుండానే ఈఎన్సీ కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. అక్రమాలను సక్రమం చేసుకునేందుకేనా? జిల్లాలో నీటి పారుదలశాఖ పనులలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే, మంజూరు కాకుం డానే రూ. కోట్లలో విలువ చేసే పనులు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాల ను సక్రమం చేసుకునేందుకు, ఈ పనులకు బిల్లుల చెల్లింపులు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఈ అధికారి సేవలను మరో ఏడాది పొడగించుకునేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈయన స్థానంలో ఇత ర అధికారులు వస్తే అనుకున్నది అనుకున్నట్లు జరిగే అవకాశం లేకపోవడంతో ఈయన సేవలనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏంటంటే మరో రెండు వారాలలో పదవీ విరమణ చేయనున్న ఈ అధికారికి సంబంధించి విజిలెన్స్ విచారణ ఎత్తివేయడంతో పాటు, పదోన్నతి కూడా కల్పించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఆ శాఖ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మేం ప్రతిపాదనలు పంపలేదు పదవీ విరమణ చేస్తున్న అధికారుల సేవల కొనసాగింపునకు సంబంధించి జిల్లా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. జిల్లాలో అలాంటి అవసరం ఉన్నట్లు మేం భావించడం లేదు. పదవీ కాలం పొడగించాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. -షాబ్జాన్, ఎస్ఈ