మెదక్ రూరల్: మెదక్, నిజమాబాద్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంచితే ఊళ్లకు ఊళ్లే ముంపునకు గురవుతాయని రెండు జిల్లాల రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. పోచారం ఎత్తు పెంచే విషయమై సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినదించారు. రెండు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు పోచారం ప్రాజెక్టు వద్ద జలదీక్ష చేపట్టి తమ ఆందోళన కొనసాగించడంతో ఈ ప్రాంతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది.
ఇటీవల నిజామాబాద్ ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రెండు జిల్లాలకు చెందిన రైతులు పోచారం ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు.
ప్రాజెక్టు ఎత్తు పెంచితే మెదక్ మండలంలోని వాడి, భూర్గుపల్లి, కొత్తపల్లి, రాజిపేటతో పాటు నిజమాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన వదూర్‌పల్లి, పోచారం, శెట్టిపల్లి, నాగిరెడ్డిపేట గ్రామాలతో పాటు వేలాది ఎకరాల్లో భూములు ముంపుకు గురవుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మద్దుతుగా మెదక్, నిజమాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మెదక్ డీసీసీ ఉపాధ్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.
పునర్నిర్మాణమంటే తెలంగాణ పల్లెలను ముంచడమేనా అని ప్రశ్నించారు. పోచారం ప్రాజెక్టు నిర్మాణంతో మెదక్ మండలంలోని మిరుగుడుపల్లే అనే గ్రామం పూర్తిగా కనుమరుగైందని, అలాగే నిజామాబాద్ జిల్లాలోని పలుగ్రామాలు మునిగిపోతే ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయి మరోచోట గ్రామాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. సమస్య గురించి ఈ ప్రాంత నేతలకు తెలిసినా వారు కేసీఆర్‌కు వివరించపోవడం దారుణంగా ఉందన్నారు. కేవలం పదవుల కోసమే వారంతా కేసీఆర్ తానా అంటే తందానా అంటూ పాటపాడుతున్నారని ధ్వజమెత్తారు.
పోచారం ప్రాజెక్టును ఎత్తుపెంచాలని నిజామాబాద్ జిల్లా రైతులు కానీ, మెదక్ జిల్లా రైతులు కానీ సీఎంను అడిగారా ...? అని ఆయన ప్రశ్నించారు. కేవలం సిద్దిపేట, గజ్వేల్‌కు తాగు, సాగునీరు అందించేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పెంచాలని కుట్ర పన్నారన్నారు. అదే జరిగితే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వమన్నారు. అంతేకాకుండా ఎక్కపడితే అక్కడ నిర్బంధిస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజాధనం అంతా గజ్వేల్, సిద్దిపేటలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంచే విషయాన్ని విరమించుకోకపోతే ప్రాణాలైనా అర్పించి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేలాది మంది రైతులతో పాటు మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు తార్య, ఆంజనేయులు, రాంచందర్‌రావు, శ్రీకాంత్, నాగేశ్వరరావు, అఫీజోద్దీన్, యామిరెడ్డి, నాగరాజు, సూర్యం, సాయిలు, రాములుతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు గోపాల్‌గౌడ్, మధుక ర్, వెంకటేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు.
పోచారం ఎత్తు పెంచితే ముప్పే
Published Wed, Aug 6 2014 2:21 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement