Jaladeeksha
-
నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జలదీక్షకు వెళ్తున్న నాగంను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కోరితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాగా మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. -
ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్భంధం చేయడం అప్రజస్వామికమని ఇంతకమటే దారుణం మరొకటి ఉండదన్నారు. మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (జగదీష్ రెడ్డి మంత్రి హోదాను మరిచిపోయారు) కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకుల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తాము చేసుకునే కార్యక్రమాలను అడ్డుకోకూడదని ఉత్తమ్ అన్నారు. మాట్లాడితే అరెస్టులు చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం రోజు హక్కులు కాలరాస్తే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతోందని విమర్శించారు. (కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!) నియంత పోకడలకు నిదర్శనం: కోమటిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌లను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) దగ్గర దీక్షా కార్యక్రమం రద్దు చేసుకొని సందర్శనకు మాత్రమే వెళదామని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఇళ్ల ముందు నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంత పోకడలకు ఈ అరెస్ట్‌లు నిదర్శనమన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జలదీక్షకు సిద్దమైన విషయం తెలిసిందే. (జూన్ 2న కాంగ్రెస్ శ్రేణుల దీక్ష) -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జలదీక్ష చేపట్టేందుకు వెళ్తున్న జగ్గారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ జిల్లాకు గోదావరి జలాలను తరలించే వరకు తాను నిరహార దీక్ష చేపడతానని ఇటీవల ఆయన ప్రకటించారు. అందులోభాగంగా సోమవారం జలదీక్ష చేపట్టడానికి వెళ్తుండగా జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
చిత్రావతి రిజర్వాయర్ ముంపు బాధితుల జలదీక్ష
-
సీమ కోసం జల దీక్ష
‘నీరు-చెట్టు’ ప్రారంభోత్సవంలో బాబు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమను సస్యశ్యామలంగా మార్చేందుకు తాను జలదీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కొందరు శివదీక్ష, మరికొందరు కనకదుర్గ దీక్ష చేస్తారని, అయితే తాను జలదీక్షకు పూనుకుంటానని ఆయ న వివరించారు. రాయలసీమకు సాగునీరు అం దించేవరకు నిద్రపోనని, అవసరమైతే కాల్వల మీదే పడుకుంటానని చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కోటేకల్లు గ్రామంలో శనివారం ఆయన ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువును పారదోలేందుకు ‘నీరు-చెట్టు’ ఉపయోగపడుతుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కోటేకల్లుకు వచ్చానన్నారు. కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని నొక్కిచెప్పారు. అనంతరం నీరు-చెట్టు పాటల సీడీని ఆవిష్కరించారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో కొత్త మద్యం విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులను ఎత్తివేసి మద్యం యజమానుల బెల్టు తీశామని ఆవేశంగా ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా ఆస్పరి మండలం బిలేకల్లుకు చెందిన వీరన్న అనే వ్యక్తి సభ మధ్యలో లేచి.. ‘మా ఊర్లో అడుగడుగునా బెల్టు షాపులున్నాయం’టూ వాపోయారు. బెల్టు దుకాణాలను ప్రోత్సహించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బాబు హెచ్చరించారు. ఆత్మగౌరవం ఉన్న నటుడు బాలకృష్ణ లెజెండ్ విజయోత్సవ సభలో సీఎం ఎమ్మిగనూరు: అభిమానం, ఆత్మగౌరవం మెండుగా ఉన్న నటుడు బాలకృష్ణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం రాత్రి ఎమ్మిగనూరు లో లెజెండ్ సినిమా 400 రోజుల విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
అయ్యప్ప దీక్ష మాదిరి జలదీక్ష: చంద్రబాబు
ఒంగోలు: భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లుగానే తాను జలదీక్ష తీసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన ముగిసింది. ఆయన ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. మునగనూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు, తాగు నీరు అందించేవరకు జలదీక్ష విరమించను అని చెప్పారు. డ్వాక్రా రుణాలను దశలవారీగా మాఫీ చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పూర్తి చేసి, తానే ప్రారంభిస్తానన్నారు. నదుల అనుసంధానంలో భాగమే పట్టిసీమ ప్రాజెక్టు అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని చంద్రబాబు అన్నారు. -
పోచారం ఎత్తు పెంచితే ముప్పే
మెదక్ రూరల్: మెదక్, నిజమాబాద్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంచితే ఊళ్లకు ఊళ్లే ముంపునకు గురవుతాయని రెండు జిల్లాల రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. పోచారం ఎత్తు పెంచే విషయమై సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినదించారు. రెండు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు పోచారం ప్రాజెక్టు వద్ద జలదీక్ష చేపట్టి తమ ఆందోళన కొనసాగించడంతో ఈ ప్రాంతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. ఇటీవల నిజామాబాద్ ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రెండు జిల్లాలకు చెందిన రైతులు పోచారం ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు ఎత్తు పెంచితే మెదక్ మండలంలోని వాడి, భూర్గుపల్లి, కొత్తపల్లి, రాజిపేటతో పాటు నిజమాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన వదూర్పల్లి, పోచారం, శెట్టిపల్లి, నాగిరెడ్డిపేట గ్రామాలతో పాటు వేలాది ఎకరాల్లో భూములు ముంపుకు గురవుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మద్దుతుగా మెదక్, నిజమాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మెదక్ డీసీసీ ఉపాధ్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. పునర్నిర్మాణమంటే తెలంగాణ పల్లెలను ముంచడమేనా అని ప్రశ్నించారు. పోచారం ప్రాజెక్టు నిర్మాణంతో మెదక్ మండలంలోని మిరుగుడుపల్లే అనే గ్రామం పూర్తిగా కనుమరుగైందని, అలాగే నిజామాబాద్ జిల్లాలోని పలుగ్రామాలు మునిగిపోతే ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయి మరోచోట గ్రామాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. సమస్య గురించి ఈ ప్రాంత నేతలకు తెలిసినా వారు కేసీఆర్‌కు వివరించపోవడం దారుణంగా ఉందన్నారు. కేవలం పదవుల కోసమే వారంతా కేసీఆర్ తానా అంటే తందానా అంటూ పాటపాడుతున్నారని ధ్వజమెత్తారు. పోచారం ప్రాజెక్టును ఎత్తుపెంచాలని నిజామాబాద్ జిల్లా రైతులు కానీ, మెదక్ జిల్లా రైతులు కానీ సీఎంను అడిగారా ...? అని ఆయన ప్రశ్నించారు. కేవలం సిద్దిపేట, గజ్వేల్‌కు తాగు, సాగునీరు అందించేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పెంచాలని కుట్ర పన్నారన్నారు. అదే జరిగితే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వమన్నారు. అంతేకాకుండా ఎక్కపడితే అక్కడ నిర్బంధిస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజాధనం అంతా గజ్వేల్, సిద్దిపేటలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంచే విషయాన్ని విరమించుకోకపోతే ప్రాణాలైనా అర్పించి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేలాది మంది రైతులతో పాటు మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు తార్య, ఆంజనేయులు, రాంచందర్‌రావు, శ్రీకాంత్, నాగేశ్వరరావు, అఫీజోద్దీన్, యామిరెడ్డి, నాగరాజు, సూర్యం, సాయిలు, రాములుతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు గోపాల్‌గౌడ్, మధుక ర్, వెంకటేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే శివ జలదీక్ష భగ్నం
సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉండి సెంటర్ వద్ద పంటకాలువలో నీళ్లలో నిలబడి జలదీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. సీమాంధ్రలో ఉద్యమం రోజురోజుకి తీవ్రమవుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జలదీక్ష విషయం తెలుసుకున్న నరసాపురం డీఎస్పీ రఘువీరారెడ్డి, భీమవరం రూరల్ సీఐ శివాజీరావు ఘటనా స్థలానికి చేరుకుని దీక్ష విరమించాలని కోరగా, ప్రాణం పోయినా దీక్షను విరమించేది లేదని శివ భీష్మించారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన దీక్ష రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. సమైక్యవాదులు అధిక సంఖ్యలో వచ్చి జలదీక్షను తిలకించారు. రాత్రి చీకటిలో కాలువలో దీక్ష కొనసాగించడం సరికాదని, విరమించాలని పోలీసులు ఎమ్మెల్యేకు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో రాత్రి 8.30 గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా కాలువ నుంచి బయటకు తీసుకువచ్చి దీక్షను భగ్నం చేశారు. అనంతరం 108లో భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.ప్రభాకర్ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.