వర్ష బీభత్సానికి పాత ఇళ్లు నేలమట్టం
నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు కూలిపోతున్నాయి. భాన్సువాడ మండల పరిధిలో వర్ష బీభత్సానికి 20 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వేలాది ఎకరాల్లో సోయపంట నీట మునిగింది. కోటగిరి మండలంలో 43 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి.
వర్ని మండలంలో 74 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. గంధారి మండలంలోని సర్వాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద వాగు పొంగిపొర్లుతుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాందేడ్- సంగారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సదాశివనగర్ కొత్త చెరువు పూర్తిగా నిండి అలుగుపోస్తోంది