కామారెడ్డి క్రైం: వాళ్లిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేసేవారు.. చివరికి మృత్యువు సైతం వారిని విడదీయలేకపోయింది. రామేశ్వర్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులిద్దరు మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన బురుగుల్ల రాహుల్(20), మహ్మద్ షఫీ(18) మంచి స్నేహితులు. రాహుల్ మున్సిపాలిటీలో కార్మికుడి గా, షఫీ స్థానికంగా ఓ మోటార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు.
ఇద్దరు కలిసి రామేశ్వర్‌పల్లిలో పని ఉండడంతో శుక్రవారం బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా హైవేపై యూటర్న్ తీసుకోబోయారు. ఆ సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాహుల్, షఫీ అక్కడికక్కడే మృతి చెందారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు.
చదవండి: (భార్యపై అనుమానం.. మద్యం సేవించి..)
ప్రమాదాల నిలయంగా యూటర్న్...
రామేశ్వర్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ఇక్కడ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడగా అనేక మందికి గాయాలయ్యాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు ధర్నాలు సైతం చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment