కళ్యాణదుర్గం: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలిచి వేసింది. ఆదివారం మధ్యాహ్నం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.
రెండు కుటుంబాల్లోనూ విషాదం..
కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సిద్ధం చంద్రశేఖరరెడ్డి, సరస్వతి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. కుమారుడు సిద్ధం లక్ష్మీకాంతరెడ్డి. పిల్లలిద్దరికీ పెళ్లి కాలేదు. అలాగే ధర్మవరంలోని గాందీనగర్‌కు చెందిన అంకె రామాంజనేయులు, రామసుబ్బమ్మ దంపతులకూ ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం.
కుమారుడు అంకె బాలచంద్ర ఎంటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి కాలేదు. కుమార్తెకు వివాహమైంది. రోడ్డు ప్రమాదంలో కుమారులను కోల్పోవడంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ‘ఒక్క గానొక్క కుమారుడిని తీసుకుపోయావా.... దేవుడా... ఇక మాకు దిక్కెవరు?’ అంటూ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇటీవలే ఇద్దరూ పరిచయమై...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిద్ధం లక్ష్మీకాంతరెడ్డి, అంకె బాలచంద్ర మధ్య ఇటీవలే స్నేహం పెరిగింది. వీరిలో లక్ష్మీకాంతరెడ్డి అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బాలచంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో లక్ష్మీకాంతరెడ్డితో కలిసి అనంతపురంలో ఒకే గదిలో ఉంటున్నాడు.
ప్రమాదాన్ని తొలుత చూసిన తండ్రి..
మృతుడు సిద్దం లక్ష్మీకాంతరెడ్డి తండ్రి చంద్రశేఖరెడ్డికి సొంతంగా బొలెరో వాహనం ఉంది. రోజూ అనంతపురంలోని టమాట మండీకి సరుకు రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం అనంతపురానికి టమాట లోడుతో వెళ్లిన ఆయన అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు.
మార్గమధ్యంలో గోళ్ల వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎవరో దురదృష్టవంతులు చనిపోయారనుకుని ముందుకెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా ఆ మార్గంలో వస్తున్న తోటి డ్రైవర్లకు ఫోన్ చేసి ‘గోళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది... జాగ్రత్తగా రండి’ అంటూ సూచించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత చూస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది తన కుమారుడేనని తెలుసుకుని గుండెలవిసేలా రోదించాడు.
(చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’)
Comments
Please login to add a commentAdd a comment